రిటైల్ ధరలు 3 నెలల కనిష్టం

14 Apr, 2015 01:14 IST|Sakshi

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ధరల పెరుగుదల రేటు వార్షికంగా మార్చిలో 5.17%గా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్‌లోని మొత్తం వస్తువులు సంబంధిత విభాగాల ధరలు 2014 మార్చి నెలతో పోల్చితే 2015 మార్చిలో 5.17 శాతం పెరిగాయన్నమాట. ఇంత కనిష్ట పెరుగుదల రేటు నమోదుకావడం మూడు నెలల తరువాత ఇదే తొలిసారి.  2014 డిసెంబర్‌లో ఈ  వార్షిక ద్రవ్యోల్బణం రేటు 5 శాతం. జనవరిలో  5.19 శాతం కాగా, ఫిబ్రవరిలో 5.37 శాతం. సోమవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.
 
కూరగాయల ధరలు భారమే...
వరుసగా రెండు నెలలతో పోల్చితే(2015 ఫిబ్రవరి, మార్చి) ధరల రేటు తగ్గినప్పటికీ, వార్షికంగా చూస్తే, కూరగాయలు, పప్పు దినుసులు, పాలు-పాల ఉత్పత్తుల ధరలు తీవ్రంగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో కూరగాయల ధరలు (వార్షిక ప్రాతిపదికన) 13.01% పెరిగితే, మార్చి నెలలో ఈ రేటు 11.26%. పప్పు దినుసుల ధర లు మార్చిలో వార్షికంగా 11.48% పెరిగాయి. ఫిబ్రవరిలో ఈ రేటు 10.61%గా ఉంది. పాలు- పాల పదార్థాల విషయంలో ఈ రేటు 9.21% నుంచి 8.35%కి తగ్గింది. కాగా, గ్రామీణ ప్రాం తాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.58%గా, పట్టణ ప్రాంతాల్లో 4.75%గా నమోదైంది.

మరిన్ని వార్తలు