క్యూ4లో తగ్గనున్న కంపెనీల మార్జిన్లు

10 Apr, 2018 01:07 IST|Sakshi

రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా

ముంబై: బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా 2016–17 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 2017–18 క్యూ4లో కంపెనీల ఆదాయాల వృద్ధి తొమ్మిది శాతానికి పరిమితమయ్యే అవకాశాలుయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. లాభాల మార్జిన్లు కూడా 0.70 శాతం దాకా క్షీణించి పన్నెండు త్రైమాసికాల కనిష్ట స్థాయి 18.6 శాతానికి తగ్గొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. 2016–17 నాలుగో త్రైమాసికంలో డీమోనిటైజేషన్‌ ప్రభాలు తగ్గుతుండటం వల్ల వినియోగ ఉత్పత్తుల రంగం గణనీయమైన వృద్ధి కనపర్చిందని క్రిసిల్‌ తెలిపింది.

దానితో పోలిస్తే తాజాగా నాలుగో త్రైమాసికంలో ఆదాయ వృద్ధి కొంత తగ్గనున్నప్పటికీ.. మెరుగైన పనితీరు కనపర్చేందుకు వినియోగ రంగమే (టెలికం విభాగం కాకుండా) దోహదపడనుందని వివరించింది. 2018 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కార్పొరేట్లు ప్రధానంగా వినియోగ ఉత్పత్తులు, కమోడిటీల ఆధారిత రంగాల ఊతంతో రెండంకెల స్థాయి వృద్ధి కనపర్చవచ్చని క్రిసిల్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ప్రసాద్‌ కొపార్కర్‌ పేర్కొన్నారు.

కమోడిటీల అధిక రేట్లతో రిస్కు..
డేటా వినియోగం భారీగా పెరిగినప్పటికీ.. టెలికం రంగం లాభదాయకత ఆందోళనకర స్థాయిలో 4.50 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని క్రిసిల్‌ పేర్కొంది. కమోడిటీలు, ముడి వస్తువుల అధిక ధరలు ఎక్కువగా విద్యుత్, ఉక్కు, వినియోగ ఉత్పత్తుల కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని, అటు రూపాయి మారకం విలువ పెరుగుదలతో ఐటీ, ఫార్మా కంపెనీలు సహా ఎగుమతి సంస్థల ఆదాయాలు దెబ్బతినొచ్చని క్రిసిల్‌ వివరించింది.

కమోడిటీల ధరలు అధికంగా ఉండటం వల్ల మార్జిన్లపై ఒత్తిళ్లు కొనసాగవచ్చని.. అయితే నిర్వహణపరమైన అంశాలు ఈ ప్రభావాన్ని కొంత తగ్గించవచ్చని తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, చమురు కంపెనీలు కాకుండా వివిధ రంగాలకు చెందిన మొత్తం 400 కంపెనీల పనితీరు అధ్యయనం ఆధారంగా క్రిసిల్‌ ఈ నివేదిక రూపొందించింది. కంపెనీలు ఈ వారం నుంచే నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.  

మరిన్ని వార్తలు