మార్కెట్లో ఆశావాదమే గెలుస్తుంది: మోబీయస్‌

26 May, 2020 15:45 IST|Sakshi

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం భారత్‌కు లాభం

ఈ ఏడాది చివరి కల్లా భారత్‌ గాడిలో పడుతుంది

స్టాక్‌ మార్కెట్లో ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా మలుచుకోవాలని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ మార్క్‌ మోబియస్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మార్కెట్‌ పతనాన్ని తన పోర్ట్‌ఫోలియోను పటిష్టం చేసేందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. స్టాక్ మార్కెట్‌ భారీ పతనాన్ని చూసినప్పుడల్లా.., తాను కొనుగోలు చేసేందుకు ఇది అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నట్లు మోబీయస్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి, ప్రపంచదేశాల లాక్‌డౌన్‌ విధింపుతో స్టాక్‌మార్కెట్ల పతనంపై మోబీయస్‌ ఒక ప్రసంగంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘సంక్షోభ సమయాల్లో సానుకూల ధృక్పథంతో ఉండాలి. ఈ ప్రపంచం ఆశావాదులకు మాత్రమే సొంతమైంది. నిరాశావాదులు ఇక్కడ విజయాల్ని పొందలేరు. ఇప్పుడు స్టాక్స్ కొనడానికి సమయం వచ్చింది.” అని మోబీయస్‌ అన్నారు. ఈక్విటీ మార్కెట్లు వెనక్కి రావడంతో గతంలో చేసిన తప్పులు సవరించుకోవడానికి, తాజాగా మరికొన్ని సంస్కరణలు చేపట్టడానికి అవకాశం వచ్చినట్లు ఆయన తెలిపారు. తన పోర్ట్‌ఫోలియోలో చైనా, ఇండియా, టర్కీ, బ్రెజిల్‌, సౌత్‌ కొరియా, సౌతాఫ్రికా దేశాలకు చెందిన షేర్లు టాప్‌లో లిస్ట్‌లో ఉంటాయని తెలిపారు. ఇక రంగాల వారీగా చూస్తే.. హెల్త్‌కేర్‌, ఎడ్యూకేషన్‌, ఇంటర్‌నెట్‌ ఆధారిత, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ షేర్లకు అధిక ప్రాధాన్యత ఉంటుందని మోబీయస్‌ చెప్పుకొచ్చారు. 

బేర్‌ మార్కెట్‌కు కాల పరిమితి చాలా తక్కువ. అయితే బుల్‌ ర్యాలీ ఎక్కువ రోజులు కొనసాగుతుందన్నారు. బేర్‌ మార్కెట్లను గరిష్టాల నుంచి కనిష్టాలకు లెక్కించాలి. అంతేకాని ఒక గరిష్టం నుంచి మరో గరిష్టానికి లెక్కించకూడదని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా చెలామణిలో కరెన్సీ పెరుగుదల కారణంగా మోబియస్ బంగారం పట్ల పాజిటివ్ అవుట్‌లుక్‌ను కలిగి ఉన్నారు. సేవింగ్స్‌లను ఫైనాన్షియల్‌ మార్కెట్లోకి తీసుకురావడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరమని అయన అన్నారు. 

ఈ ఏడాది కల్లా భారత్‌ గాడిలో పడుతుంది
ఈ ఏడాది చివరి కల్లా భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కోవిడ్ -19 తరువాత భారత్‌ అద్భుతమైన పనితీరు ఆకట్టుకుంటుంది. వేగంగా కోలుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరి కల్లా చాలా వరకు ఆర్థిక వ్యవస్థ బౌన్స్‌ బ్యాంక్‌ అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి భారత్‌కు అంతా మంచే జరగుతుందనే మోబీయస్‌ ఆశిస్తున్నారు.

ఇప్పటికీ చాలా ఇండియా పేద దేశమని భ్రమపడుతున్నారని, వాస్తవానికి భారత్‌ సంపన్న దేశమని ఆయన అన్నారు. ఇక్కడ చాలా డబ్బు ఉందని అన్నారు. ఇండియా అవుట్‌లుక్‌ చాలా ఉన్నతంగా ఉంది. ప్రస్తుత పరస్థితి చిన్న, మధ్య స్థాయి కంపెనీలకు గొప్ప అవకాశంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ స్థాయి కంపెనీల ఎంపికలో క్యాలిటీ, వృద్ధి అంశాలను తీక్షణంగా పరిశీలించాలన్నారు. అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం భారత్‌కు లాభం అని ఆయన అభిప్రాయడ్డారు. భారత్‌ను సాఫ్ట్‌వేర్ సేవలకు అవుట్‌సోర్సింగ్ హబ్‌గా కాకుండా, మొబైల్ ఫోన్లు, ఇతర హార్డ్‌వేర్‌లకు అవుట్‌సోర్సర్‌గా మారాల్సిన అవసరం ఉందని మోబీయస్‌ అన్నారు. 
 

మరిన్ని వార్తలు