'రిస్క్ తీసుకోకపోవడంకన్నా మరో రిస్క్ లేదు'

23 Aug, 2016 18:07 IST|Sakshi
'రిస్క్ తీసుకోకపోవడంకన్నా మరో రిస్క్ లేదు'

న్యూయార్క్: ఏ వ్యాపార రంగంలో రాణించాలన్నా రిస్క్ తీసుకోవడం ముఖ్యం. ఏ రిస్క్ తీసుకోక పోవడం అన్నింటికన్నా పెద్ద రిస్క్. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పేటెండ్ డైలాగ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీల్లో ఏటా పెట్టుబడులు పెట్టే 'వై కాంబినేటర్’ కంపెనీ ప్రెసిడెంట్ శ్యామ్ ఆల్ట్‌మేన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ మాటనే చెప్పారు. అయితే రిస్క్ తీసుకోవడం అంటే తొందరపడి వెర్రి నిర్ణయాలు తీసుకోవడం కాదని ఆయన స్పష్టం చేశారు.

వ్యాపార రంగంలో రాణించాలంటే యువతకు ఇచ్చే సలహా ఏమిటని శ్యామ్ ఆయన్ని సూటిగా ప్రశ్నించగా, ‘వేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో అతిపెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అన్నింటికన్నా పెద్ద రిస్క్. కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, మార్పులు, చేర్పులు చేయకపోతే కంపెనీ ఎదగడంలో వెనకబడి పోతుంది. అలాఅని ఉత్పత్తుల్లో తరచుగా మార్పులు తీసుకరాకూడదు. కంపెనీ గురించి దూరాలోచన చేయక పోవడం వల్ల అలాంటి మార్పులకు ఆస్కారం ఏర్పడుతుంది. ఏ కంపెనీలోనైనా తోటి వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. మన కంపెనీ బాగా రాణిస్తున్నప్పుడు మార్పుల పేరిట వెర్రి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని జుకర్ బర్గ్ తెలిపారు.

 ఫేస్‌బుక్ ఇటీవల 200 కోట్ల డాలర్లకు ‘ఆకులస్’ కంపెనీని కొనుగోలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఫేస్‌బుక్‌కు కూడా ఆకులస్ లాంటి టాలెంట్ ఉందని, అయితే అన్ని తామే చేయాలనుకునే తత్వం కూడా మంచిది కాదని అన్నారు. అంతేకాకుండా ప్రతిసారి ఉన్న కంపెనీలో మార్పులు తీసుకొచ్చే బదులు కొత్త కంపెనీలను తీసుకోవడం పెద్ద ముందడుగు అనిపిస్తుందని, ఆకులస్ కంపెనీని కొనుగోలు చేయడం కూడా అలాంటి ముందడుగని తాను భావిస్తున్నానని చెప్పారు. పైగా ఆకులస్‌లో టాలెంట్ పీపుల్ ఉన్నారని ఆయన చెప్పారు.

అచ్చం స్నాప్‌చాట్ తరహాలో పనిచేసే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను ఫేస్‌బుక్ ఇటీవల ఆవిష్కరించడాన్ని జుకర్‌బర్గ్ ప్రస్తావిస్తూ, వినియోగదారుల మనోభావాల మేరకు అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. కావాలనుకుంటే స్నాప్‌చాట్ స్టోరీస్ ఫీచర్‌ను ఫేస్‌బుక్ తీసుకరావచ్చని, కానీ కాపీ అనే ముద్ర కూడా కంపెనీ మీద ఉండకూడదని ఆయన చెప్పారు.

‘ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోవాలనుకున్నప్పుడు అందులో ఉన్న ప్రతికూల అంశాల గురించి మన చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని హెచ్చరిస్తుంటారు. వారి మాటల్లో వాస్తవం లేకపోలేదు. ప్రతి నిర్ణయంలో సానుకూల, ప్రతికూల అంశాలు తప్పక ఉంటాయి. ప్రతికూల అంశాలకు భయపడి ఏ నిర్ణయం తీసుకోకపోతే కంపెనీలో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అది ప్రమాదరకరం. అందుకని పెద్ద రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ అన్నది సర్వదా నా అభిప్రాయం’ అని జుకర్ బర్గ్ తన ఇంటర్వ్యూను ముగించారు.

మరిన్ని వార్తలు