4 నెలల గరిష్టం- 36,487కు సెన్సెక్స్‌

6 Jul, 2020 15:54 IST|Sakshi

466 పాయింట్ల హైజంప్‌

నిఫ్టీ 156 పాయింట్లు ప్లస్‌

రియల్టీ, ఆటో, మెటల్‌ జోరు

ఫార్మా స్వల్ప వెనకడుగు

వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. ఇన్వెస్టర్లు తొలి నుంచీ కొనుగోళ్లకు కట్టుబడటంతో సెన్సెక్స్‌ 466 పాయింట్లు ఎగసి 36,487 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 156 పాయింట్లు జమ చేసుకుని 10,764 వద్ద నిలిచింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. లిక్విడిటీ దన్ను, ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం అండగా మార్కెట్లు రోజంతా హుషారుగా కదిలాయి. వెరసి సెన్సెక్స్‌ 36,313 వద్ద ప్రారంభమై 36,667 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 10,724 వద్ద మొదలై 10,811 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

బ్యాంకింగ్‌ అండ
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా మాత్రమే(0.6 శాతం) నీరసించగా.. మిగిలిన అన్ని రంగాలూ బలపడ్డాయి. ప్రధానంగా రియల్టీ, ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌, ఐటీ 3-1.2 శాతం మధ్య ఎగశాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, హిందాల్కో, టాటా మోటార్స్‌, ఆర్‌ఐఎల్‌, మారుతీ, వేదాంతా, టీసీఎస్‌, టాటా స్టీల్‌, యూపీఎల్‌ 7.4-2.7 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో బజాజ్‌ ఆటో, గెయిల్‌, ఎయిర్టెల్‌, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, హెచ్‌యూఎల్‌ 1-0.5 శాతం మధ్య నష్టపోయాయి.

భెల్‌ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో భెల్‌ 12 శాతం దూసుకెళ్లగా.. ఎస్‌ఆర్‌ఎఫ్‌, అశోక్‌ లేలాండ్‌, ఎన్‌సీసీ, కమిన్స్‌ ఇండియా, సెంచురీ టెక్స్‌ 7.4-5 శాతం మధ్య ఎగశాయి. అయితే లుపిన్‌, టొరంట్‌ ఫార్మా, ఐడియా, మారకో, ఐజీఎల్‌, దివీస్‌ లేబ్స్‌, అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌ 3-1 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1.3 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1640 లాభపడగా.. 1152 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో  వారాంతాన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 857 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 332 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 557 కోట్ల అమ్మకాలు నిర్వహించగా.. డీఐఐలు రూ. 909 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు