మార్కెట్‌ క్రాష్‌ : కారణం అది కాదు

5 Feb, 2018 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ : రికార్డుల వర్షం కురిపించిన స్టాక్‌మార్కెట్లలో బడ్జెట్‌ ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈక్విటీ లాభాలపై దీర్ఘకాల మూలధన లాభాల పన్నును విధించనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో ప్రకటించడంతో, శుక్రవారం స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఒక్క రోజే సెన్సెక్స్‌ 840 పాయింట్ల మేర పతనమైంది. నిఫ్టీ సైతం తీవ్రంగా నష్టాలు పాలైంది. ఈ నష్టాలు నేటి(సోమవారం) సెషన్‌లోనూ కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు కుదేలయ్యాయి. అయితే స్టాక్‌మార్కెట్లపై ఇంతగా ప్రభావం చూపిన ఈ ఎల్‌టీసీజీ పన్నుపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. 

మార్కెట్ల పతనానికి కారణం ఎల్‌టీజీసీ పన్ను కాదంటూ చెప్పుకొచ్చారు. గ్లోబల్‌ అంశాలతో మార్కెట్లు పడిపోతున్నట్టు పేర్కొన్నారు. ఎల్‌టీసీజీ లేదా బడ్జెట్‌ తో మార్కెట్లు పడిపోవడం లేదని, డౌ జోన్స్‌ కూడా 2 శాతం మేర నష్టపోయిందని జైట్లీ చెప్పారు. డౌ జోన్స్‌ ఇండస్ట్రియల్‌ యావరేజ్‌ 665.75 పాయింట్లు పతనమైందని సూచిస్తూ.. జైట్లీ ఈ విషయాన్ని తెలిపారు. కాగ, దేశీయ స్టాక్‌మార్కెట్లు అదేమాదిరి నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 310 పాయింట్ల నష్టంలో 34,756 వద్ద, నిఫ్టీ 93 పాయింట్ల నష్టంలో 10,667 వద్ద ట్రేడవుతున్నాయి.

మరిన్ని వార్తలు