వాటా విక్రయం బాటలో పాజిటివ్ లైఫ్

20 Jan, 2015 01:57 IST|Sakshi
వాటా విక్రయం బాటలో పాజిటివ్ లైఫ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ సంస్థ వాటా విక్రయానికి సన్నాహాలు చేస్తోంది. పలు ప్రైవేటు ఈక్విటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్న ఈ సంస్థ... మెజారిటీ వాటాను తమ వద్దే ఉంచుకుని, 49 శాతం వరకూ విక్రయించాలని భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పాజిటివ్ హోమియోపతి, పాజిటివ్ డెంటల్ బ్రాండ్లతో సేవలందిస్తున్న ఈ సంస్థ.. వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులను విస్తరణపై వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాల్లో విస్తరించిన పాజిటివ్ లైఫ్‌సెన్సైస్... ఉత్తరాదికీ శాఖలను పరిచయం చేయనుంది. అలాగే 2016 మార్చికల్లా దుబాయి, శ్రీలంకతోపాటు ఇతర దేశాల్లోనూ అడుగు పెడుతోంది. కొత్తగా 70కిపైగా శాఖల్ని ఏర్పాటుచేయాలని భావిస్తోంది.
 
బ్రాండ్ విలువ రూ. 200 కోట్లు..
పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో పాజిటివ్ హోమియోపతి బ్రాండ్ కింద 40 కేంద్రాలను నిర్వహిస్తోంది. పాజిటివ్ డెంటల్ బ్రాండ్‌లో హైదరాబాద్‌లో 5, కర్నూలులో ఒక కేంద్రం ఉంది. ఆన్‌లైన్ ద్వారా అమెరికాలోని రోగులకూ సేవలందిస్తోంది.

వైద్యులైన ఏఎం రెడ్డి, టి.కిరణ్‌కుమార్, ఏ.సృజన సంస్థ ప్రమోటర్లుగా ఉన్నారు. కంపెనీ 2014-15లో రూ.40 కోట్ల టర్నోవర్‌పై రూ.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇక సంస్థ విలువను ఆకాశం కన్సల్టింగ్ రూ.200 కోట్లుగా లెక్కగట్టినట్లు పాజిటివ్ లైఫ్‌సెన్సైస్ ఎండీ ఎ.ఎం.రెడ్డి ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘‘దక్షిణాదిన హోమియోతోపాటు దంత వైద్య రంగంలో సుస్థిర వాటా దక్కించుకున్నాం. పెద్ద ఎత్తున విస్తరించాలన్న లక్ష్యంతోనే వాటా విక్రయానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విస్తరణకు రూ.60 కోట్ల దాకా అవసరమవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని వివరించారు.
 
భారీ విస్తరణ దిశగా..
ఈ ఏడాదే ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో శాఖలను తెరుస్తామని ఎ.ఎం.రెడ్డి చెప్పారు. పాజిటివ్ హోమియోపతి బ్రాండ్‌లో కొత్తగా 60 శాఖలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. పాజిటివ్ డెంటల్‌లో 2015లో 5, 2016లో 7 శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు, వరంగల్, వైజాగ్, విజయవాడ, గుంటూరులలో ఇవి రానున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక టెక్నాలజీతో ఒక్కోటి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తామని, ఒక్కో డెంటల్ కేంద్రం రెండేళ్లలో బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని తెలియజేశారు. హోమియో వైద్య కళాశాల ఏర్పాటును వేగవంతం చేశామన్నారు.

>
మరిన్ని వార్తలు