కన్సాలిడేషన్‌- స్వల్ప నష్టాలతో సరి

22 Jul, 2020 15:56 IST|Sakshi

59 పాయింట్లు డౌన్‌

37,871 వద్దకు సెన్సెక్స్‌

30 పాయింట్లు మైనస్‌

11,132 వద్ద ముగిసిన నిఫ్టీ

పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, ఐటీ వీక్‌

కొద్ది రోజులుగా ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ఒడిదొడుకుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 59 పాయింట్లు క్షీణించి 37,871 వద్ద నిలవగా.. నిఫ్టీ 30 పాయింట్లు తక్కువగా 11,132 వద్ద స్థిరపడింది. దాదాపు 5 రోజులపాటు మార్కెట్లు లాభపడటంతో ట్రేడర్లు లాభాల స్వీకరణ చేపట్టడం ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,199 వద్ద గరిష్టాన్ని, 37,602 దిగువన కనిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ 11,238- 11,057 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. కరోనా వైరస్‌ అమెరికాసహా పలు దేశాలలో వేగంగా విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లు పసిడివైపు దృష్టిసారించడం కూడా సెంటిమెంటును బలహీనపరచినట్లు నిపుణులు తెలియజేశారు.

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఆటో, ఐటీ, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1.6-0.7 శాతం మధ్య బలహీనపడగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా 0.6 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో యాక్సిస్‌ 7 శాతం, టైటన్‌ 5 శాతం చొప్పున జంప్‌చేయగా.. పవర్‌గ్రిడ్‌, జీ, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఆర్‌ఐఎల్‌, యూపీఎల్‌, వేదాంతా, ఇన్‌ఫ్రాటెల్‌ 3.6-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో హీరో మోటో, బీపీసీఎల్‌, హెచ్‌యూఎల్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, విప్రో, మారుతీ, శ్రీ సిమెంట్‌, బ్రిటానియా, ఇన్ఫోసిస్‌ 3.5-2 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ జూమ్‌
డెరివేటివ్స్‌ కౌంటర్లలో ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 10 శాతం దూసుకెళ్లగా.. ముత్తూట్‌, పీవీఆర్‌, చోళమండలం, ఫెడరల్‌ బ్యాంక్‌, మణప్పురం, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా 7-4 శాతం మధ్య ఎగశాయి. కాగా..  మరోవైపు పిరమల్‌, జిందాల్‌ స్టీల్‌, ఎస్‌బీఐ లైఫ్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, హెచ్‌పీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 4.5-2.7 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.2 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ 0.25 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1172 లాభపడితే..  1471 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐలు భళా..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2266 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 727 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1710 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 1522 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

మరిన్ని వార్తలు