లాభాల్లో ముగిసిన మార్కెట్లు

21 May, 2020 16:08 IST|Sakshi

సెన్సెక్స్‌ 114 పాయింట్లు ప్లస్‌

30,933 వద్ద ముగింపు

ఇంట్రాడేలో 370 పాయింట్లు అప్‌

ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ జోరు

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉత్సాహంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి ప్రస్తావించదగ్గ లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్‌ 114 పాయింట్లు పుంజుకుని 30,933 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40 పాయింట్లు బలపడి 9,106 వద్ద స్థిరపడింది. అయితే అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్‌ 370 పాయింట్లు ఎగసింది. 31,189కు చేరింది. తదుపరి కొనుగోళ్ల జోరు తగ్గడంతో 30,765వరకూ వెనకడుగు వేసింది. ఈ బాటలో నిఫ్టీ 9178- 9056 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. అల్ఫాబెట్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ తదితర టెక్నాలజీ దిగ్గజాల అండతో బుధవారం అమెరికా మార్కెట్లు 2 శాతంవరకూ లాభపడిన విషయం విదితమే.

ప్రయివేట్‌ బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగాలు 2 శాతం ఎగశాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా సైతం 1-0.7 శాతం మధ్య బలపడగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 0.7 శాతం నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, హీరో మోటో, మారుతీ, యూపీఎల్‌, బజాజ్‌ ఆటో, ఐషర్‌, సన్‌ ఫార్మా, విప్రో 7-2.25 శాతం మధ్య పెరిగాయి. అయితే బజాజ్‌ ఫిన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ 3.6-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి.

ఇండిగో జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఇండిగో అశోక్‌ లేలాండ్‌, యూబీఎల్‌, మెక్‌డోవెల్‌, అమరరాజా, బెర్జర్‌ పెయింట్స్‌, ఎన్‌ఎండీసీ 7.5-5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క బంధన్‌ బ్యాంక్‌, చోళమండలం, మైండ్‌ట్రీ, పీఎఫ్‌సీ, అదానీ పవర్‌, ఐబీ హౌసింగ్‌ 5.3-2.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.75 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1330 లాభపడగా.. 910 నష్టపోయాయి.

విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 1467 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 2373 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2513 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు