హుషారుగా మొదలై చివర్లో వెనకడుగు

26 May, 2020 15:57 IST|Sakshi

తొలుత 31,000 దాటిన సెన్సెక్స్‌

30,609 పాయింట్ల వద్ద ముగింపు

నామమాత్ర నష్టంతో నిలిచిన నిఫ్టీ

మెటల్‌, ఆటో జూమ్‌- ఐటీ, ఫార్మా వీక్‌

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 63 పాయింట్లు తక్కువగా 30,609 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు క్షీణించి 9,029 వద్ద ముగిసింది. అయితే ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిముషాలలోనే సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా జంప్‌చేసింది. 31,087కు ఎగసింది. తదుపరి మిడ్‌సెషన్‌ నుంచీ బలహీనపడుతూ వచ్చింది. చివరికి లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. ఒక దశలో 30,512 వరకూ నీరసించింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 9162- 8997 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆసియా, యూరోపియన్‌ మార్కెట్లు లాభపడినప్పటికీ ఎంపిక చేసిన కొన్ని కౌంటర్లలో ట్రేడర్లు అమ్మకాలకు దిగడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు తెలియజేశారు. గురువారం మే డెరివేటివ్‌ సిరీస్‌ ముగియనుండటంతో ఒడిదొడుకులు ఎదురైనట్లు తెలియజేశారు. 

ఎఫ్‌ఎంసీజీ సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ 2.7-1 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ, ఫార్మా 2-1.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐషర్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌, ఇండస్‌ఇండ్‌, శ్రీసిమెంట్‌, హిందాల్కో, నెస్లే, ఐటీసీ, మారుతీ 6-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, సన్‌ ఫార్మా, హీరో మోటో, సిప్లా, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, వేదాంతా 6-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి.

జిందాల్‌ జూమ్‌
డెరివేటివ్స్‌లో జిందాల్‌ స్టీల్‌, అదానీ పవర్‌, మదర్‌సన్‌, రామ్‌కో సిమెంట్‌, టాటా పవర్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, బాలకృష్ణ 14-5 శాతం మధ్య దూసుకెళ్లాయి. కాగా.. మరోపక్క పిరమల్‌, ఎస్కార్ట్స్‌, ఇండిగో, కేడిలా హెల్త్‌, కాల్గేట్‌ పామోలివ్‌ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో 1.2-0.6 శాతం మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1225 లాభపడగా.. 1124 నష్టపోయాయి.

అమ్మకాలవైపు..
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1354 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సైతం రూ. 344 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. గురువారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 259 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌ రూ. 402 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు