ఆటుపోట్ల మధ్య నష్టాల ముగింపు

17 Jun, 2020 15:48 IST|Sakshi

సెన్సెక్స్‌ 97 పాయింట్లు డౌన్‌

నిఫ్టీ 33 పాయింట్ల వెనకడుగు

తొలుత సెన్సెక్స్‌ 34,000 సమీపానికి

ఇంట్రాడేలో 10,000 అధిగమించిన నిఫ్టీ 

మీడియా, రియల్టీ, ఫార్మా, ఆటో అప్‌

గత నెలలో రిటైల్‌ సేల్స్‌ అనూహ్యంగా పుంజుకోవడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే వాస్తవాధీన రేఖ వద్ద చైనాతో సైనిక వివాదం తలెత్తడంతో దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు రోజంతా ఆటుపోట్ల మధ్యే కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 33,508 వద్ద నిలవగా.. నిఫ్టీ 33 పాయింట్లు నీరసించి 9,881 వద్ద ముగిసింది. ఓవైపు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరోపక్క చైనాతో లడఖ్‌ సమీపంలో వివాదం కారణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 33,934 వద్ద గరిష్టాన్ని చేరగా.. 33,333 వద్ద కనిష్టాన్నీ తాకింది. ఇక నిఫ్టీ సైతం 10,004- 9,834 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.

బ్యాంక్స్‌ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రంగాలు 0.8-0.5 శాతం మధ్య బలహీనపడగా.. మీడియా, ఆటో, రియల్టీ, ఫార్మా 1.8-0.5 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్‌ఫ్రాటెల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, శ్రీ సిమెంట్‌, బజాజ్‌ ఫిన్‌, హిందాల్కో, ఏషియన్‌ పెయింట్స్‌, వేదాంతా 4.5-1.7 శాతం మధ్య క్షీణించాయి. అయితే మారుతీ, ఎయిర్‌టెల్‌, విప్రో, బ్రిటానియా, యాక్సిస్‌, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌, బీపీసీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జీ 4-1 శాతం మధ్య ఎగశాయి. 

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, బీహెచ్‌ఈఎల్‌, సెయిల్‌, జస్ట్‌డయల్‌, ఎక్సైడ్‌, డాబర్‌ 3-2 శాతం మధ్య క్షీణించాయి. కాగా.. మరోపక్క చోళమండలం ఫైనాన్స్‌, మదర్‌సన్‌, ఎస్కార్ట్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, భారత్‌ ఫోర్జ్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, సన్‌ టీవీ, బయోకాన్‌ 8-3 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.3-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1433 లాభపడగా.. 1125 నష్టపోయాయి.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1479 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1162 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2960 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1076 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు