అమెరికా మార్కెట్ల పతనం

16 Oct, 2014 03:44 IST|Sakshi
అమెరికా మార్కెట్ల పతనం

అదే బాటలో యూరో సూచీలు
న్యూయార్క్: బ్యాంకింగ్, రిటైల్, టెక్నాలజీ దిగ్గజాల ఫలితాలపై అనుమానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు, ముడిచమురు ధరల పతనం వంటి అంశాలు మరోసారి అమెరికా స్టాక్ మార్కెట్లకు షాకిచ్చాయి. ఇవిచాలవన్నట్లు తాజాగా ఎబోలా వ్యాధి వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతోఇన్వెస్టర్లలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి. వెరసి గత మూడేళ్లలోలేని విధంగా అమెరికా స్టాక్ సూచీలు బుధవారం 2.5%పైగా పతనమయ్యాయి.

కడపటి వార్తలందేసరికి డోజోన్స్ 426 పాయింట్లు పతనమై 15,889కు చేరగా, నాస్‌డాక్ 100 పాయింట్లు పడిపోయి 4,127 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎస్‌అండ్‌పీ-500 సూచీ సైతం 49 పాయింట్లు దిగజారి 1,828 వద్ద నేలచూపులు చూస్తోంది. ఇప్పటికే యూరోజోన్‌లో ప్రధాన ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారుకోవడం యూరప్‌లోనూ సెంటిమెంట్‌కు దెబ్బతగిలింది. దీంతో అటు యూరప్ దేశాల స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి.

జర్మనీ ఇండెక్స్ డాక్స్ 253 పాయింట్లు జారి 8,572కు చేరగా, యూకే ఇండెక్స్ ఎఫ్‌టీఎస్‌ఈ 181 పాయింట్లు క్షీణించి 6,212ను తాకింది. ఇక ఫ్రాన్స్ ఇండెక్స్ సీఏసీ 149 పాయింట్లు నష్టపోయి 3,940 వద్ద నిలిచింది. కాగా, ఈ ప్రభావం గురువారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చునని నిపుణులు పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రతిబింబిస్తూ సింగపూర్‌లో ట్రేడయ్యే నిఫ్టీ 120 పాయింట్లు పతనంకావడం గమనార్హం.

మరిన్ని వార్తలు