ఒక్క రోజు బ్రేక్‌- మళ్లీ దూకుడు షురూ

9 Jul, 2020 15:55 IST|Sakshi

మార్కెట్ల హైజంప్‌

409 పాయింట్లు అప్‌

36,738 వద్దకు సెన్సెక్స్‌

 నిఫ్టీ 108 పాయిం‍ట్లు ప్లస్‌

మెటల్‌, బ్యాంక్స్‌ దన్ను

సానుకూల విదేశీ సంకేతాలు, ఇటీవల బలపడిన సెంటిమెంటు జత కలసి దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో ఒక్క రోజు వెనకడుగు తదుపరి తిరిగి జోరందుకున్నాయి. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఇంట్రాడే గరిష్టాలకు సమీపంలోనే నిలిచాయి. వెరసి సెన్సెక్స్‌ 409 పాయింట్లు జంప్‌చేసి 36,738 వద్ద ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు ఎగసి 10,814 వద్ద నిలిచింది. సమయం గడిచేకొద్దీ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. దీంతో 36,451 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 36,422 వద్ద కనిష్టాన్ని తాకగా..తదుపరి 36,806 వరకూ ఎగసింది. ఈ బాటలో 10,755 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,837- 10,733 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.

ఎఫ్‌ఎంసీజీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(0.3 శాతం) మినహా మిగిలిన అన్ని రంగాలూ పుంజుకున్నాయి. ప్రధానంగా మెటల్‌, బ్యాంకింగ్‌, రియల్టీ 2-0.5 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, గెయిల్‌, బజాజ్‌ ఫిన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌, ఎంఅండ్‌ఎం 6.6-2.2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా, ఓఎన్‌జీసీ, హీరో మోటో, విప్రో, మారుతీ ప్రస్తావించదగ్గ స్థాయిలో 2-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో జిందాల్‌ స్టీల్‌, సెంచురీ టెక్స్‌, సెయిల్‌, ఎస్కార్ట్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఈక్విటాస్‌ 5.3-3.4 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు బీఈఎల్‌, హెచ్‌పీసీఎల్‌, కమిన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఇండిగో, మారికో, కంకార్‌, టాటా కెమ్‌ 3.6-1.6 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.5 శాతం పుంజుకుంది. ట్రేడైన షేర్లలో 1423 లాభపడగా.. 1276 నష్టపోయాయి.

అమ్మకాల బాట
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 995 కోట్లు, దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 853 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అయితే మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 830 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 784 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 348 కోట్లు, డీఐఐలు రూ. 263 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు