నేడు సానుకూల ఓపెనింగ్‌ చాన్స్‌!

20 May, 2020 08:52 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 27 పాయింట్లు అప్‌

యూఎస్‌ మార్కెట్లు 1.5 శాతం డౌన్‌

అటూఇటుగా ఆసియా స్టాక్‌ మార్కెట్లు

నేడు(బుధవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  ఉదయం 8.30 ప్రాంతం‍లో 27 పాయింట్లు పుంజుకుని 8,918 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మే నెల ఫ్యూచర్స్‌ 8,891 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 చికిత్సకు మోడర్నా ఇంక్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ వేలిడిటీపై ప్రశ్నలు తలెత్తడంతో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 1.5-0.5 శాతం మధ్య క్షీణించాయి. ఇక ప్రస్తుతం ఆసియాలో మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ తదుపరి కొంతమేర ఆటుపోట్లను చవిచూడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. మంగళవారం సెన్సెక్స్‌ 167 పాయింట్లు ఎగసి 30,196 వద్ద నిలవగా.. నిఫ్టీ 56 పాయింట్లు బలపడి 8,879 వద్ద ముగిసిన విషయం విదితమే.
 
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 8800 పాయింట్ల వద్ద, తదుపరి 8,754 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు  భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు జోరందుకుంటే..నిఫ్టీకి తొలుత 9,050 పాయింట్ల వద్ద, ఆపై 9,170 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 17,150 పాయింట్ల వద్ద, తదుపరి 16800 వద్దపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు.ఒకవేళ పుంజుకుంటే తొలుత 17800 పాయింట్ల వద్ద, తదుపరి 18270 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు. 

విక్రయాల బాటలోనే..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1328 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌ (డీఐఐలు) రూ. 1660 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 2513 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ సైతం రూ. 152 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. 

మరిన్ని వార్తలు