ఫెడ్‌ ఎఫెక్ట్‌- మార్కెట్లు నేలచూపులతో!

11 Jun, 2020 08:50 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 51 పాయింట్లు డౌన్‌

2020పై ఫెడ్‌ నిరుత్సాహకర అంచనాలు

యూఎస్‌ జీడీజీ 6.5 శాతం క్షీణత!

9.3 శాతానికి నిరుద్యోగిత

యూఎస్‌, యూరప్‌ మార్కెట్లు వీక్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు నష్టాలలో

నేడు (గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 51 పాయింట్లు క్షీణించి 10,091 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జూన్‌ నెల ఫ్యూచర్స్‌ 10,142 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగుతూ చరిత్రాత్మక గరిష్టాలవైపు సాగుతున్న అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం బలహీనపడ్డాయి.రెండు రోజులపాటు పాలసీ సమీక్షను చేపట్టిన కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా సున్నా స్థాయిలోనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది(2020) యూఎస్‌ జీడీపీ 6.5 శాతం క్షీణించవచ్చని అంచనా వేసింది. అంతేకాకుండా నిరుద్యోగ రేటు 9.3 శాతానికి చేరవచ్చని ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అభిప్రాయపడ్డారు. అయితే అవసరమైతే మరోసారి ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం యూరోపియన్‌, యూఎస్‌ మార్కెట్లు 0.6-1.2 శాతం మధ్య నష్టపోయాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో నేడు దేశీయంగా మార్కెట్లు నీరసంగా ప్రారంభంకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. తదుపరి ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా.. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాంకింగ్‌ కౌంటర్లకు డిమాండ్‌ పెరగడంతో రోజంతా దాదాపు సానుకూలంగానే కదిలాయి. వెరసి సెన్సెక్స్‌ 290 పాయింట్లు ఎగసి 34,247కు చేరగా.. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 10,116 వద్ద ముగిసింది.    

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 10052 పాయింట్ల వద్ద, తదుపరి 9,989 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,164 పాయింట్ల వద్ద, ఆపై  10,213 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 20,764 పాయింట్ల వద్ద, తదుపరి 20,428 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,344 పాయింట్ల వద్ద, తదుపరి 21,588 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 919 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 501 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 733 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 813 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 1238 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు