నష్టాలతో మొదలైన మార్కెట్‌

18 Jun, 2020 09:22 IST|Sakshi

కొనసాగుతున్న భారత్‌-చైనాల భౌగోళిక ఉద్రిక్తతల భయాలు

అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో రంగ షేర్లలో అమ్మకాలు

భారత స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 84 పాయింట్లు కోల్పోయి 33423 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 9890 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారత్‌-చైనాల మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల, అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన సంకేతాలు, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెసర్ల పెట్టుబడుల ఉపసంహరణ మళ్లీ మొదలవడం... తదితర అంశాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో రంగ షేర్లలో అమ్మకాలు నెలకొనగా... రియల్టీ, మీడియా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతానికి పైగా నష్టపోయి 20, 064 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోగా, రోజురోజూకు మరింత పెరుగుతుండటం మార్కెట్‌ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. బజాజ్‌ కన్జూ‍్యమర్‌ కేర్‌, ఐఆర్‌బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, కేర్‌ రేటింగ్స్‌ లాంటి మధ్య తరహా కంపెనీల క్యూ4 ఫలితాల ప్రకటన నేపథ్యంలో నేడు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు. 

అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాలు:
భారత ఈక్విటీ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపే అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరిపై ఆశవాహ అంచనాలతో నిన్న యూరప్‌ మార్కెట్లు 1శాతం లాభంతో ముగిశాయి. అమెరికాలో ఆరు రాష్ట్రాలలో తిరిగి కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. ఫలితంగా అక్కడి ప్రధాన సూచీలు 3రోజుల వరుస లాభాలకు ముగింపు పలుకుతూ మిశ్రమంగా ముగిశాయి. డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌లు అరశాతం నష్టపోగా, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ మాత్రం 0.15శాతం స్వల్ప లాభంతో స్థిరపడింది. ఇక నేడు అమెరికా డో జోన్స్‌ ఫ్యూచర్లు 1.5శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి. ఆసియాలో అన్ని దేశాలకు చెందిన ఇండెక్స్‌లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా జపాన్‌ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. సింగపూర్‌, థాయిలాండ్‌, దేశాల ఇండెక్స్‌లు అరశాతం క్షీణిచాయి. హాంగ్‌కాంగ్‌, చైనా, ఇండోనేషియా, కొరియా, తైవాన్‌ దేశాలకు చెందిన సూచీలు అరశాతం లోపు పతనాన్ని చవిచూశాయి.

అదానీ పోర్ట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, ఓఎన్‌జీసీ షేర్లు 1శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. వేదాంత, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జీ లిమిటెడ్‌, యూపీఎల్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు