మార్కెట్లు పతనం- ఈ షేర్లు హైజంప్‌

14 Jul, 2020 14:16 IST|Sakshi

625 పాయింట్లు పడిన సెన్సెక్స్‌

185 పాయింట్లు దిగజారిన నిఫ్టీ

టాటా కమ్యూనికేషన్స్‌ 5% ప్లస్‌

ఎవరెడీ ఇండస్ట్రీస్‌ 10 శాతం అప్

ప్రపంచ దేశాలను నిరంతరంగా వణికిస్తున్న కోవిడ్‌-19 దెబ్బకు దేశీయంగా సెంటిమెంటు బలహీనపడింది. దీనికితోడు సోమవారం యూఎస్‌ మార్కెట్లు వెనకడుగు వేయగా.. ప్రస్తుతం ఆసియాలోనూ ప్రతికూల ధోరణి నెలకొంది. ఈ నేపథ్యంలో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌  625 పాయింట్లు పతనమై  36,068ను తాకగా.. నిఫ్టీ 185 పాయింట్లు క్షీణించి 10,617 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా టాటా కమ్యూనికేషన్స్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి పతన మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..

టాటా కమ్యూనికేషన్స్‌
కొద్ది నెలలుగా లాభాల దౌడు తీస్తున్న టెలికం రంగ దిగ్గజం టాటా కమ్యూనికేషన్స్‌ కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది.  అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 33 ఎగసి రూ. 699ను అధిగమించి ఫ్రీజయ్యింది. తద్వారా రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఇంతక్రితం 2017 డిసెంబర్‌ 15న మాత్రమే ఈ స్థాయిలో ట్రేడయ్యింది. గత మూడు నెలల్లో ఈ కౌంటర్‌ 112 శాతం ర్యాలీ చేయడం గమనార్హం!  గతేడాది చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడానికితోడు మార్జిన్లు 5.3 శాతం మెరుగుపడటంతో ఇటీవల షేరు జోరు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. సర్వీసులు, డేటా ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. రానున్న నాలుగేళ్ల కాలంలో నిర్వహణ లాభాలను రెట్టింపునకు పెంచుకోవాలని కంపెనీ యాజమాన్యం భావిస్తోంది.

ఎవరెడీ ఇండస్ట్రీస్
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం డాబర్‌ ప్రమోటర్లు కంపెనీలో వాటాను కొనుగోలు చేసిన వార్తలతో కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, బ్యాటరీల తయారీ కంపెనీ ఎవరెడీ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ జోరు చూపుతోంది. అమ్మేవాళ్లు కరువుకాగా.. కొనేవాళ్లు అధికంకావడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రూ. 8 ఎగసి రూ. 89 వద్ద ఫ్రీజయ్యింది. ఎవరెడీ ఇండస్ట్రీస్‌లో బల్క్‌డీల్‌ ద్వారా డాబర్‌ ప్రమోటర్లు 8.8 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ అంశంపై వివరణ ఇవ్వవలసిందిగా ఎవరెడీని బీఎస్‌ఈ ఆదేశించింది. ఇది బర్మన్‌ కుటుంబ వ్యక్తిగత పెట్టుబడిగా సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎవరెడీలో బర్మన్‌ కుటుంబ వాటా 20 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి.

>
మరిన్ని వార్తలు