స్టాక్‌ మార్కెట్లకు కోవిడ్‌-19 షాక్‌

14 Jul, 2020 16:03 IST|Sakshi

661 పాయింట్లు జారిన సెన్సెక్స్‌ 

ఇంట్రాడేలో 36,000 దిగువకు

నిఫ్టీ 195 పాయింట్లు పతనం

బ్యాంక్స్‌, ఆటో, మెటల్‌ బోర్లా

ఐటీ, రియల్టీ వీక్‌- ఫార్మా ఎదురీత

అంతర్జాతీయ స్థాయిలో కోవిడ్‌-19 కేసులు అదుపులేకుండా పెరుగుతున్న కారణంగా దేశీ స్టాక్‌ మార్కెట్లకు అమ్మకాల షాక్‌ తగిలింది. వెరసి సెన్సెక్స్‌ 661 పాయింట్లు కోల్పోయింది. 36,033 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 195 పాయింట్లు పతనమై 10,607 వద్ద స్థిరపడింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కోరలు చాస్తుండటంతో సెంటిమెంటుకు దెబ్బ తగిలినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడవచ్చన్న ఆందోళనలు పెరిగినట్లు తెలియజేశారు. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఫలితంగా సెన్సెక్స్‌ 36,517 వద్ద ప్రారంభమై 35,877 వరకూ పతనమైంది. తొలుత నమోదైన 36,538 ఇంట్రాడే గరిష్టంగా నమోదైంది. ఈ బాటలో నిఫ్టీ 10,756 వద్ద గరిష్టాన్ని తాకగా.. 10,563 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇంట్రాడే కనిష్టాలకు చేరువలోనే మార్కెట్లు ముగియడం అమ్మకాల తీవ్రతను సూచిస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు.

3 షేర్లు మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా 0.5 శాతం బలపడగా.. మిగిలిన అన్ని రంగాలూ నీరసించాయి. బ్యాంక్‌ నిఫ్టీ, మెటల్‌, ఆటో, రియల్టీ, ఐటీ 3.2-1.2 శాతం మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, యాక్సిస్‌, ఐషర్‌, జీ, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫిన్‌, మారుతీ, హిందాల్కో, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌ 5.5-3.3 శాతం మధ్య వెనకడుగు వేశాయి. బ్లూచిప్స్‌లో కేవలం డాక్టర్‌ రెడ్డీస్‌ 2 శాతం, టైటన్‌ 1 శాతం చొప్పున లాభపడగా.. ఎయిర్‌టెల్‌ 0.3 శాతం బలపడింది.

ఫైనాన్స్‌ పతనం
డెరివేటివ్‌ కౌంటర్లలో భెల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఇండిగో, నాల్కో, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బాష్‌ 8-5 శాతం మధ్య కుప్పకూలాయి. కాగా.. మరోపక్క బయోకాన్‌, టొరంట్‌ ఫార్మా, టాటా కెమికల్స్‌, నౌకరీ, మహానగర్‌ గ్యాస్‌, ఇంద్రప్రస్థ, బాటా, జూబిలెంట్‌ ఫుడ్‌ 5.3-1.25 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం చొప్పున డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 1855 నష్టపోగా.. 830 మాత్రమే లాభాలతో నిలిచాయి.

డీఐఐల భారీ అమ్మకాలు
నగదు విభాగంలో సోమవారంవిదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 222 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 1459 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 1031 కోట్లు, డీఐఐలు రూ. 431 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు