మూడో రోజు మార్కెట్లకు నష్టాలే

24 Apr, 2019 00:52 IST|Sakshi

 సెన్సెక్స్‌కు 80 పాయింట్లు డౌన్‌

18 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

కొనసాగిన చమురు ధరల ఆందోళన

చమురు ధరల పెరుగుదల దేశ ఆర్థిక రంగంపై ప్రభావం చూపిస్తుందన్న భయం ఇన్వెస్టర్లను వెన్నాడడంతో స్టాక్‌ మార్కెట్లు మూడో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం లాభాల్లోనే కొనసాగినప్పటికీ అమ్మకాల కారణంగా వాటిని నిలబెట్టుకోలేకపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,832.61 పాయింట్ల వరకు పెరగ్గా, 38,518 పాయింట్ల కనిష్ట స్థాయినీ నమోదు చేసింది. రోజంతా అస్థిరతల మధ్య కొనసాగిన ట్రేడింగ్‌... చివరి గంటలో అమ్మకాలతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. సెన్సెక్స్‌ నికరంగా 80 పాయింట్లు నష్టంతో (0.21 శాతం) 38,565 పాయింట్ల వద్ద క్లోజయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18.5 పాయింట్లు కోల్పోయి (0.16శాతం) 11,576 వద్ద ముగిసింది. రానున్న కంపెనీల ఫలితాలు, ఎన్నికల సరళి రానున్న వారాల్లో మార్కెట్ల గమ్యాన్ని నిర్ణయించగలవన్న అభిప్రాయం మార్కెట్‌ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. 

ఆటో, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ నష్టాలు
ఆటోమొబైల్, ఫైనాన్షియల్, టెలికం స్టాక్స్‌ ఎక్కువ నష్టపోయాయి. ప్రధాన సూచీలోని మారుతి షేరు 3.60 శాతం నష్టపోయింది. అలాగే, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హీరో మోటోకార్ప్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ షేర్లు ఎక్కువ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్, హెచ్‌యూఎల్‌ స్టాక్స్‌ లాభపడ్డాయి. మరోవైపు బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 0.62 శాతం పెరిగి 74.5 డాలర్లకు చేరింది. 

యస్‌ బ్యాంకు షేరుపై సందేహాలు
రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో యస్‌ బ్యాంకుకు ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉందని, మరో విడత పుస్తకాల తనిఖీ జరుగుతోందంటూ యస్‌ బ్యాంకు గురించి వచ్చిన వార్తలతో ఆ షేరులో ఎక్కువ యాక్టివిటీ ఉన్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసాని తెలిపారు. ఈ షేరు సోమవారం 6 శాతానికి పైగా నష్టపోగా, మంగళవారం కూడా 2.33 శాతం నష్టపోయి రూ.232.85 వద్ద క్లోజయింది.    

జెట్‌ ఎయిర్‌వేస్‌ ర్యాలీ
మూడు రోజుల నష్టాల తర్వాత జెట్‌ఎయిర్‌వేస్‌ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఈ షేరు 10 శాతం లాభంతో బీఎస్‌ఈలో రూ.169.90 వద్ద క్లోజయింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌ విజయవంతమై, తిరిగి కార్యకలాపాలు ఆరంభిం చగలదన్న విశ్వాసమే లాభాలకు కారణంగా విశ్లేష కులు భావిస్తున్నారు. అయితే  జాగ్రత్త అవసరమని చిన్న ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన.  

మరిన్ని వార్తలు