36,220–36,778 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు

4 Feb, 2019 05:12 IST|Sakshi

మార్కెట్‌ పంచాంగం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల అనంతరం లబ్దిపొందుతాయని అంచనావేస్తున్న ఆటో, కన్జూమర్‌ షేర్లు ర్యాలీ జరపగా, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలతో బాండ్లతో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లు క్షీణించాయి. మరోవైపు రూపాయి క్షీణత ఫలితంగా ఐటీ షేర్లు కూడా మెరుగుపడ్డాయి. రానున్న కొద్ది రోజుల్లో బడ్జెట్‌ రోజునాటి ట్రెండే కొనసాగే అవకాశం లేదు. మరో మూడు నెలల్లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలపై అంచనాలు, ప్రపంచ ఆర్థికాభివృద్ధి గమనం తదితర అంశాలపై మార్కెట్‌ దృష్టి నిలపవచ్చు. తాజా బడ్జెట్‌ ప్రతిపాదనలపై విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ కదలికలు ఉండొచ్చు.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,   

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఫిబ్రవరి 1తో ముగిసిన వారం తొలిరోజున 35,565 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పతనమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం బడ్జెట్‌ సమర్పణ తర్వాత 36,778 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగింది. చివరకు అంతక్రితంవారంకంటే 444 పాయింట్లు లాభపడి 36,469 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్‌ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలు సెన్సెక్స్‌ సమీప ట్రెండ్‌కు కీలకం. ఆ రోజునాటి కనిష్టస్థాయి అయిన 36,220 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తుండగా, నిరోధం ఆ రోజునాటి గరిష్టస్థాయి అయిన 36,778 పాయింట్ల వద్ద ఎదురవుతున్నది, ఈ శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు సెన్సెక్స్‌ వచ్చేవారం కదలవచ్చు. 36,220 పాయింట్ల స్థాయిని కోల్పోతే వేగంగా 35,740 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ రెండో మద్దతును కోల్పోయి, ముగిస్తే 35,565–35,380 పాయింట్ల శ్రేణి వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం 36,778 పాయింట్ల స్థాయిని అధిగమించి, ముగిస్తే అప్‌ట్రెండ్‌ బలోపేతమై 37,050–37,200 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపై 37,500 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు.  

నిఫ్టీ కీలక శ్రేణి 10,813–10,983
గతవారం తొలిరోజున 10,630 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తదుపరి క్రమేపీ పెరుగుతూ వారాంతంలో 10,983 పాయింట్ల గరిష్టస్థాయిని అందుకుంది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 114 పాయింట్ల లాభంతో 10,894 పాయింట్ల వద్ద ముగిసింది. బడ్జెట్‌ రోజునాటి కనిష్ట, గరిష్టస్థాయిలైన 10,813–10,983 పాయింట్ల శ్రేణిని నిఫ్టీ ఎటు ఛేదిస్తే అటు వేగంగా కదలవచ్చు. 10,813 పాయింట్ల స్థాయిని కోల్పోయి, ముగిస్తే 10,680 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ రెండో మద్దతును సైతం వదులుకుంటే వేగంగా 10,630–10,535 పాయింట్ల శ్రేణి వరకూ తగ్గవచ్చు.  ఈ వారం నిఫ్టీ 10,983 పాయింట్ల స్థాయిని దాటగలిగితే పటిష్టమైన అప్‌ట్రెండ్‌లోకి మార్కెట్‌ మళ్లవచ్చు. కొద్ది వారాల నుంచి పలు దఫాలు గట్టి అవరోధాన్ని కల్పిస్తున్న ఈ స్థాయిపైన నిఫ్టీ వేగంగా 11,100 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపైన 11,220 పాయింట్ల స్థాయి కూడా నిఫ్టీకి కష్టసాధ్యం కాదు. 

మరిన్ని వార్తలు