వెలుగులో ఎఫ్‌ఎంసీజీ షేర్లు

17 May, 2016 02:39 IST|Sakshi
వెలుగులో ఎఫ్‌ఎంసీజీ షేర్లు

* 164 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
* నిఫ్టీ 46 పాయింట్లు అప్

ముంబై: టోకు ద్రవ్యోల్బణం పెరగడం, రుతుపవనాల జాప్యంకావొచ్చన్న అంచనాలు వంటి ప్రతికూలాంశాల నడుమ ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సోమవారం స్టాక్ సూచీలు పెరిగాయి. ట్రేడింగ్ ఆరంభంలో బ్యాంకింగ్ షేర్లలో జరిగిన అమ్మకాల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,352 పాయింట్ల స్థాయికి తగ్గినప్పటికీ, ముగింపులో వేగంగా కోలుకుంది.

చివరకు 164 పాయింట్ల పెరుగుదలతో రూ. 25,653 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,772 పాయింట్ల కనిష్టస్థాయి నుంచి రికవరీ అయ్యి, 46 పాయింట్ల ప్లస్‌తో 7,861 పాయింట్ల వద్ద ముగిసింది.
 
ఐటీసీ ర్యాలీ...
దేశంలోకి రుతుపవనాల రాక వారం రోజులు ఆలస్యం కావొచ్చంటూ వాతావరణ శాఖ అంచనాల్ని ప్రకటించినప్పటికీ, ఆశ్చర్యకరంగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీ ఐటీసీ 3 శాతంపైగా ర్యాలీ జరిపి రూ. 329.30 వద్ద ముగిసింది. ఇదే రంగానికి చెందిన మరో దిగ్గజ కంపెనీ హిందుస్థాన్ యూనీలీవర్ 1.7 శాతం ఎగిసింది. ఐటీ షేర్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్‌లు 0.5-1.6 శాతం మధ్య పెరిగాయి. ఫార్మా షేర్లు డాక్టర్ రెడ్డీస్ లాబ్ 2.5 శాతం, టుపిన్ 1.2 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం 1.7 శాతం వరకూ పెరిగాయి.
 
పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్ల పతనం..
భారీ మొండి బకాయిల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వెల్లడిస్తున్న ఫలితాలు దారుణంగా ఉండటంతో ఆ షేర్లలో తీవ్ర అమ్మకాలు జరిగాయి. గత శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో ఐదు పీఎస్‌యూ బ్యాంకులు నష్టాల్ని కనపర్చాయని, దాంతో ఈ కౌంటర్లలో ఇన్వెస్టర్లు విక్రయాలు జరిపినట్లు బీఎన్‌పీ పారిబాస్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. అన్నింటికంటే అధికంగా బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 8.4 శాతం పతనమై రూ. 142.30 వద్ద ముగిసింది.

ఎస్‌బీఐ 4.17 శాతం క్షీణించగా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆలహాబాద్ బ్యాంక్, పీఎన్‌బీ, ఓరియంటల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 3-6 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు రెండు ప్రైవేటు బ్యాంకింగ్ షేర్లు నూతన గరిష్టస్థాయిల్ని అందుకోవడం విశేషం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.7 శాతం పెరిగి రూ. 1,163 వద్ద ముగియగా, యస్ బ్యాంక్ 3 శాతం ర్యాలీ జరిపి రూ. 980 వద్ద క్లోజయ్యింది. ఈ రెండు షేర్లూ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం.

మరిన్ని వార్తలు