చివర్లో లాభాల స్వీకరణ...

4 Jan, 2018 00:41 IST|Sakshi

233 పాయింట్ల శ్రేణిలో తిరిగిన సెన్సెక్స్‌

19 పాయింట్ల నష్టంతో 33,793కు సెన్సెక్స్‌ 

1 పాయింట్‌ లాభంతో 10,443కు నిఫ్టీ

ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన  బుధవారం నాటి ట్రేడింగ్‌లో చివరకు స్టాక్‌ మార్కెట్‌ మిశ్రమంగా ముగిసింది. చివరి గంటలో అమ్మకాల కారణంగా ఆరంభ లాభాలన్నీ కోల్పోయి సెన్సెక్స్‌ స్వల్పంగా నష్టపోగా, నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు త్వరలో వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు జాగరూకతతో వ్యవహరించడం, ట్రేడింగ్‌ చివర్లో వాహన, ఐటీ, ఆయిల్, గ్యాస్, టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 19 పాయింట్ల నష్టంతో 33,793 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1 పాయింట్‌ లాభంతో 10,443 పాయింట్ల వద్ద ముగిశాయి.

ఒడిదుడుకులు...
సెన్సెక్స్‌ 33,930 పాయింట్ల వద్ద లాభాల్లోనే ప్రారంభమైంది. కొనుగోళ్ల జోరుతో 186 పాయింట్ల లాభంతో 33,998 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో 47 పాయింట్ల నష్టంతో 33,765 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. రోజు మొత్తంలో   233 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. 

ముడి చమురు సెగ...
ముడి చమురు ధరలు ఎగియడంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. ఇటీవల బాగా పెరిగిన వాహన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుందని, ఆదాయ వృద్ధి బాగా ఉంటుందనే అంచనాలతో లోహ షేర్లు లాభపడ్డాయని వివరించారు. 

ఏడాది గరిష్టానికి 120 షేర్లు..
జామ్‌నగర్‌లో కొత్తగా రిఫైనరీ ఆఫ్‌–గ్యాస్‌ క్రాకర్‌ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 0.5 శాతం లాభపడి రూ.916 వద్ద ముగిసింది. అంచనాలకు అనుగుణంగానే మూడో క్వార్టర్‌ అమ్మకాలు ఉన్నాయని వెల్లడించడంతో టైటాన్‌  కంపెనీ 1.3 శాతం పెరిగింది. అదానీ పోర్ట్స్‌ 2.7 శాతం పెరిగింది.  

మరిన్ని వార్తలు