అమ్మకాల క్షీణత, ఉద్యోగాల కోత

3 Aug, 2019 15:03 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొంది. ఖర్చులు తగ్గించుకునే క్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు పడిపోవడంతో ఉద్యోగులపై వేటు వేసింది.  ఈ మేరకు మారుతి సుజుకి రాయిటర్స్‌ కిచ్చిన సమాచారంలో వెల్లడించింది. చైర్మన్ ఆర్‌సీ భార్గవ మాట్లాడుతూ, వ్యాపార మందగమనం నేపథ్యంలో, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. తాత్కాలిక ఉద్యోగుల నియామకాలకు కూడా ఇదే కారణమన్నారు. అయితే భవిష్యత్తులో ఎంతమంది ఉద్యోగులపై వేటు వేయనున్నారనే దానిపై వివరాలు ఇవ్వలేదు. ఈ తిరోగమనం కొనసాగితే మార్జినల్‌, వీక్‌ కంపెనీలు మనుగడ సాగించడం కష్టమని వ్యాఖ్యానించారు.  

జూన్ 30 తో ముగిసిన ఆరు నెలల్లో సగటున 18,845 మంది తాత్కాలిక కార్మికులను నియమించినట్లు మారుతి సుజుకి రాయిటర్స్‌కు పంపిన ఇమెయిల్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం లేదా 1,181 తగ్గిందని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి ఉద్యోగాల కోత  పెరిగిందని కంపెనీ తెలిపింది. 

భారతదేశంలో పాసెంజర్‌ వాహన విక్రయాల్లో టాప్‌లో ఉండే మారుతి సుజుకి, జూలై, 2018 తో  పోలిస్తే, ఈ ఏడాది జూలైలో (33.5 శాతం) అమ్మకాలు 109 265 యూనిట్లకు పడిపోయాయి. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఉత్పత్తిని 10.3 శాతం  తగ్గించామని గతంలో సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశ ఉత్పాదక ఉత్పత్తిలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకున్న ఆటో మొబైల్‌ రంగం దాదాపు ఒక దశాబ్దం కాలంగా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. వాహన అమ్మకాలు కూడా అంతే వేగంగా పడిపోతున్నాయి. 

మరోవైపు ప్రభుత్వ నిరుద్యోగ గణాంకాలు పాతవని, విశ్వసనీయత లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగ రేటు పెరిగి జులై నాటికి 7.51 శాతానికి చేరింది. ఈ ఏడాది ప్రారంభం ఇది 5.66 శాతంగా ఉండేదని సీఎంఐఈ  తెలిపింది. వీరిలో రోజువారీ కూలీలను కలపలేదు.

మారుతి ఉద్యోగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కుల్దీప్ జంఘు మాట్లాడుతూ మానేసర్, గురుగ్రామ్ ప్లాంట్లలో తాత్కాలిక కార్మికుల సగటు వేతనం నెలకు 250 డాలర్లుగా ఉందనన్నారు.   కాగా ఈ రెండు ప్లాంట్లు కలిపి సంవత్సరానికి 1.5 మిలియన్లకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంస్థ 1983 లో గురుగ్రామ్ ప్లాంట్  నుంచే  తన ప్రసిద్ధ మారుతి 800 మోడల్‌ను విడుదల చేసింది. ఆటోరంగ అమ్మకాల తిరోగమనం పరిశ్రమ అంతటా ఉద్యోగాలను ప్రమాదంలో పడేస్తోంది. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) మాట్లాడుతూ, ఈ తిరోగమనం కొనసాగితే విడిభాగాల తయారీదారులు తమ 5 మిలియన్ల మంది  కార్మికుల్లో 5వ వంతును తగ్గించుకోవచ్చని పేర్కొంది. 

మరిన్ని వార్తలు