టాప్‌ గేర్‌లో మారుతీ సుజుకీ

20 Sep, 2018 01:11 IST|Sakshi

ప్యాసింజర్‌  వాహనాల  విక్రయాల్లో నెంబర్‌ వన్‌ 

టాప్‌ 10లో   6 మారుతీవే.. 

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఆగస్టు విక్రయాలు టాప్‌ గేర్‌లో దూసుకుపోయాయి. ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విభాగానికి సంబంధించిన టాప్‌ 10 విక్రయ జాబితాలో ఏకంగా 6 వాహనాలు ఈ కంపెనీకి చెందినవే ఉన్నట్లు సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చరర్స్‌ (సియామ్‌) వెల్లడించింది. తాజా గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎంట్రీ లెవెల్‌ కారైన ఆల్టో అమ్మకాలు 22,237 యూనిట్లుగా నమోదై నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాయి. గతేడాది ఇదేకాలానికి 21,521 యూనిట్లను కంపెనీ విక్రయించింది. కాంపాక్ట్‌ సెడాన్‌ డిజైర్‌ 21,990 యూనిట్లతో రెండవ స్థానంలో నిలువగా.. ప్రీమియం హచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ విక్రయాలు 19,115 యూనిట్లుగా నమోదై మూడవ స్థానంలో ఉన్నట్లు సియామ్‌ తెలిపింది.

బాలెనో 17,713 యూనిట్లు, వ్యాగన్‌ ఆర్‌ 13,658 యూనిట్లు, కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా అమ్మకాలు 13,271 యూనిట్లతో ఆగస్టు టాప్‌ టెన్‌ జాబితాలో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఏడవ స్థానంలో హ్యుందాయ్‌ కంపెనీకి చెందిన కాంపాక్ట్‌ హచ్‌బ్యాక్‌ గ్రాండ్‌ ఐ10 నిలిచింది. ఆగస్టు 11,489 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆతరువాత స్థానంలో ఉన్న ఎలైట్‌ ఐ20 11,475 యూనిట్లు కాగా, క్రెటా 10,394 యూనిట్లతో 9వ స్థానంలోనూ, హోండా కాంపాక్ట్‌ సెడాన్‌ అమేజ్‌ 9,644 యూనిట్లతో 10వ స్థానంలోనూ నిలిచాయి.   

మరిన్ని వార్తలు