మారుతీ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి 

2 Mar, 2019 00:49 IST|Sakshi

ఫిబ్రవరిలో పెరిగిన కార్ల విక్రయాలు 

హోండా, మహీంద్రా రెండంకెల స్థాయిలో వృద్ధి 

న్యూఢిల్లీ: కొనుగోలుదారుల సెంటిమెంట్‌ జనవరితో పోలిస్తే కొంత మెరుగుపడిన నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో కార్ల విక్రయాలు కొంత మెరుగుపడ్డాయి. మారుతీ సుజుకీ విక్రయాల్లో స్వల్ప వృద్ధి నమోదు కాగా.. హోండా కార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా రెండంకెల స్థాయి వృద్ధి కనపర్చాయి. టాటా మోటార్స్‌ కార్ల అమ్మకాలు రెండు శాతం పెరగ్గా, టయోటా కిర్లోస్కర్‌ విక్రయాలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మారుతీ సుజుకీ ఫిబ్రవరిలో 1,39,100 కార్లను విక్రయించింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ సంఖ్య 1,37,900గా ఉంది. మారుతీకి సంబంధించి మినీ సెగ్మెంట్‌ (ఆల్టో) కార్ల విక్రయాలు 26.7 శాతం క్షీణించి 33,789 యూనిట్ల నుంచి 24,751 యూనిట్లకు పడిపోయాయి. అయితే, కాంపాక్ట్‌ కార్ల సెగ్మెంట్‌ (వ్యాగన్‌ ఆర్‌ తదితర) విక్రయాలు 11.4 శాతం, యుటిలిటీ వాహనాల అమ్మకాలు (ఎస్‌–క్రాస్‌ మొదలైనవి) 7.4 శాతం పెరిగాయి.  

 మరోవైపు, హోండా కార్స్‌ ఇండియా అమ్మకాలు 16 శాతం వృద్ధితో 11,650 యూనిట్ల నుంచి 13,527 యూనిట్లకు పెరిగాయి. అమేజ్, సిటీ, డబ్ల్యూఆర్‌–వీ మోడల్స్‌ ఇందుకు దోహదపడ్డాయని సంస్త వీపీ రాజేష్‌ గోయల్‌ చెప్పారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా విక్రయాలు కూడా 17 శాతం వృద్ధితో 22,389 యూనిట్ల నుంచి 26,109 యూనిట్లకు చేరాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ300 మోడల్‌ ఊతంతో యుటిలిటీ వెహికల్స్‌ విభాగం రెండంకెల స్థాయి వృద్ధి సాధించినట్లు సంస్థ ప్రెసిడెంట్‌ (ఆటోమోటివ్‌ విభాగం) రాజన్‌ వధేరా చెప్పారు. అటు టాటా మోటార్స్‌ దేశీ అమ్మకాలు రెండు శాతం వృద్ధితో 18,110 యూనిట్లకు చేరాయి. సవాళ్లు ఉన్నప్పటికీ.. కొత్త తరం ఉత్పత్తులతో మెరుగైన పనితీరే కనపర్చగలిగామని సంస్థ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వాహనాల విభాగం) మయాంక్‌ పరీఖ్‌ చెప్పారు. అటు టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ విక్రయాలు 11,864 యూనిట్ల నుంచి 11,760 యూనిట్లకు తగ్గాయి.  

బజాజ్‌ ఆటో 4 శాతం అప్‌ .. 
ద్విచక్ర వాహనాల విభాగానికి సంబంధించి ఫిబ్రవరిలో బజాజ్‌ ఆటో అమ్మకాలు 4 శాతం వృద్ధి నమోదు చేశాయి. 2,14,023 యూనిట్ల నుంచి 2,21,706కి చేరాయి. మరోవైపు టీవీఎస్‌ మోటార్స్‌ విక్రయాలు స్వల్ప వృద్ధితో 2,30,353 యూనిట్స్‌ నుంచి 2,31,582 యూనిట్స్‌కి పెరిగాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా