మారుతీ కార్ల  ధరలకు రెక్కలు 

6 Dec, 2018 00:56 IST|Sakshi

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతోంది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్న  కారణంగా ధరలను పెంచక  తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నామని పేర్కొన్న  ఈ కంపెనీ ఎంత మేరకు ధరలను పెంచేది వెల్లడించలేదు. కమోడిటీ ధరలు పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య రేట్లు కూడా పెరుగుతున్నాయని, ఫలితంగా ఉత్పత్తి వ్యయాలు అధికమవుతున్నాయని మారుతీ సుజుకీ తెలిపింది.

ఈ భారాన్ని కొంత వినియోగదారులపై మోపక తప్పడం లేదని పేర్కొంది. అందుకే వివిధ మోడళ్ల కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నామని వివరించింది.   ప్రస్తుతం ఈ కంపెనీ రూ.2.53 లక్షల ఖరీదుండే ఎంట్రీలెవల్‌ కారు ఆల్టో800 నుంచి రూ.11.45 లక్షల ధర గల ప్రీమియమ్‌ క్రాసోవర్‌ ఎస్‌–క్రాస్‌ వరకూ విభిన్న రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది.  కాగా, టయోటా తన వాహనాల ధరలను 4 శాతం వరకూ, ఇసుజు మోటార్స్‌ కంపెనీ తన వాహనాల ధరలను రూ. లక్ష వరకూ పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు