కార్లు... ప్రియం

17 Aug, 2018 00:47 IST|Sakshi

రేట్లు పెంచిన మారుతీ

సెప్టెంబర్‌ నుంచి పెంచనున్న మెర్సిడెస్‌ బెంజ్‌

న్యూఢిల్లీ: పెరిగిన ముడివస్తువుల ధరల భారాన్ని తగ్గించుకునే దిశగా దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా తమ కార్ల రేట్లను పెంచింది. వివిధ మోడల్స్‌పై రూ. 6,100 దాకా (ఎక్స్‌ షోరూం ఢిల్లీ) ధరలను పెంచినట్లు, ఇది గురువారం నుంచే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. పెరిగిన కమోడిటీల రేట్లు, పంపిణీ వ్యయాలు, విదేశీ మారకం రేట్లపరంగా ప్రతికూల పరిస్థితులు మొదలైన సవాళ్లను కొంత అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఎంట్రీ లెవెల్‌ ఆల్టో 800 నుంచి మధ్య స్థాయి సెడాన్‌ సియాజ్‌తో పాటు మారుతీ సుజుకీ వివిధ మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 2.51 లక్షల నుంచి రూ. 11.51 లక్షల దాకా (పెంపునకు ముందు) ఉన్నాయి. మరోవైపు, సెప్టెంబర్‌ నుంచి వాహనాల రేట్లను 4 శాతం దాకా పెంచనున్నట్లు లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ వెల్లడించింది. పెరిగిపోతున్న ముడివస్తువుల ధరలు, విదేశీ మారకంపరమైన ఒడిదుడుకులు ఇందుకు కారణమని పేర్కొంది.

మోడల్‌ను బట్టి సెప్టెంబర్‌ 1 నుంచి రేట్లు 4 శాతం దాకా పెరుగుతాయని మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా ఎండీ రోలాండ్‌ ఫోల్గర్‌ తెలిపారు. సెడాన్‌ కార్ల నుంచి ఎస్‌యూవీల దాకా సుమారు రూ.27.86 లక్షల నుంచి రూ. 1.94 కోట్ల శ్రేణిలో మెర్సిడెస్‌ బెంజ్‌ కార్ల ధరలు ఉన్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, హోండా కార్స్‌ ఇండియా మొదలైన కంపెనీలు కూడా రేట్లు ఈ నెలలోనే పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు