‘వ్యాగన్‌ఆర్‌ బీఎస్‌–6’ వెర్షన్‌

15 Jun, 2019 09:23 IST|Sakshi

ధర రూ.5.96 లక్షలు

న్యూఢిల్లీ: బీఎస్‌–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వ్యాగన్‌ఆర్‌ కారును శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రకటించింది. నూతన ప్రమాణాలతో కూడిన 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కారు ధరల శ్రేణి రూ.5.15 లక్షల నుంచి రూ.5.96 లక్షలుగా నిర్ణయించింది. అయితే, ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో మోడల్‌ ఆధారంగా ధరల శ్రేణి రూ.5.10 లక్షల నుంచి రూ.5.91 లక్షలుగా కాగా.. మునుపటి వెర్షన్‌తో పోల్చితే అన్ని ప్రాంతాల్లో ఈ నూతన వ్యాగన్‌ఆర్‌ బీఎస్‌–6 కారు ధర రూ.16,000 వరకు పెరిగినట్లు తెలిపింది.

కేవలం 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌లో మాత్రమే నూతన వెర్షన్‌ అందుబాటులో ఉన్నట్లు స్పష్టంచేసింది. మరోవైపు 1–లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ వ్యాగన్‌ఆర్‌ ధరల్లో కూడా మార్పులు చేసింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ.4.34 లక్షల నుంచి రూ.5.33 లక్షలు కాగా, మిగిలిన ప్రాంతాల్లో ధరల శ్రేణి రూ.4.39 లక్షల నుంచి రూ.5.38 లక్షలకు సవరించింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ స్విఫ్ట్‌ పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌ కార్లు ఇప్పుడు ఏఐఎస్‌–145 భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు