కరోనా : క్షీణించిన మారుతి విక్రయాలు

1 Apr, 2020 13:34 IST|Sakshi

కరోనా దెబ్బకు  పడిపోయిన మారుతి విక్రయాలు 

 మార్చి నెలలో దాదాపు సగానికి తగ్గిన అమ్మకాలు

సాక్షి, ముంబై: భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ దేశీయ వాహన అమ్మకాలు మరోసారి భారీగా పడిపోయాయి. మార్చి మాసంలో సంవత్సర ప్రాతిపదికన  48 శాతం క్షీణతను నమోదు చేశాయి.  ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా  అమలవుతున్న లాక్ డౌన్  ఆటో  అమ్మకాలను ప్రభావితం చేసింది.  కరోనా వైరస్ను అడ్డుకనేందుకు ప్రభుత్వం ఇచ్చిన  పిలుపులో భాగంగా  మార్చి 22, 2020 నుండి కార్యకలాపాలను నిలిపివేశామనీ, దీని మూలంగా మార్చి 2020 లో అమ్మకాలు 2019 మార్చిలో అమ్మకాలతో పోల్చలేమని కంపెనీ బుధవారంనాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 

కరోనావైరస్ ఆందోళనల  మధ్య ఆటోమొబైల్ అమ్మకాలు మార్చి 15 నుండి  పాతాళానికి పడిపోయాయి. దీంతో మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో కంపెనీ 76,976 యూనిట్లను విక్రయించింది, ఏడాది క్రితం 147,613 యూనిట్లుగా వుంది. ముఖ్యంగా కాంపాక్ట్ అమ్మకాల క్షీణత  మారుతి దేశీయ అమ్మకాలను దెబ్బతీసింది. మారుతి  ప్రసిద్ధ మోడళ్లైన స్విఫ్ట్, బాలెనో, వాగన్ఆర్  డిజైర్లను   కార్ల విక్రయాలు 51 శాతం క్షీణించాయి.  సంవత్సరానికి 42,000 యూనిట్లకుపైగా తగ్గిపోయాయి. మినీ కేటగిరీలో, ఆల్టో,  ఎస్-ప్రెస్సో విక్రయాలు 5శాతం తగ్గి 15,988 యూనిట్లకు చేరుకుందని కంపెనీ నివేదించింది.  యుటిలిటీ వెహికల్ విభాగంలో  మారుతి విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్ , ఎక్స్‌ఎల్ 6 అమ్మకాలు 53శాతం పడిపోయి 11,904 యూనిట్లకు తగ్గింది.  మధ్యతరహా సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా ఏడాది క్రితం 3,672 యూనిట్ల నుండి 1,863 యూనిట్లకు తగ్గాయి. వ్యాన్స్ విభాగంలో, ఇది 5,966 యూనిట్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 64 శాతం క్షీణత. కంపెనీ తన తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్ క్యారీలో 736 యూనిట్లను మాత్రమే విక్రయించింది. అంతకు ముందు ఏడాది  ఈ సంఖ్య 2,582 యూనిట్లు. మార్చిలో కంపెనీ మొత్తం ఎగుమతులు  55శాతం తగ్గి  4,712 యూనిట్లుగా ఉన్నాయి.  అయితే  2020 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 14,36,124 యూనిట్లను మారుతి విక్రయించింది, ఇది 18శాతం క్షీణత కాగా, ఎగుమతులతో సహా మొత్తం అమ్మకాలు 15,63,297 యూనిట్లు, గత ఆర్థిక సంవత్సరంలో 18,62,449 యూనిట్లు. అంటే 16శాతం క్షీణించాయి. 

కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనం, బలహీనమైన డిమాండ్, 2020 ఆర్థిక సంవత్సరంలో బీఎస్-6 నిబంధనలు, మూలధన కొరత వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన ఆటో పరిశ్రమకు కరోనా రూపంలో మరో భారీ దెబ్బ తగిలింది.  అయితే లాక్‌డౌన్‌ తర్వాత కొన్నాళ్లపాటు బీఎస్‌4 వాహనాల విక్రయానికి సుప్రీం కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు