మారుతీ జోరు తగ్గింది..

26 Oct, 2018 00:19 IST|Sakshi

క్యూ2లో నికర లాభం 10% క్షీణతతో రూ.2,240 కోట్లుగా నమోదు

నాలుగేళ్లలో లాభాలు తగ్గడం ఇదే ప్రథమం

రూపాయి క్షీణత, కమోడిటీ ధరల రూపంలో సెగ 

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ, విక్రయ సంస్థ మారుతీ సుజుకి సెప్టెంబర్‌ క్వార్టర్లో గడ్డు పరిస్థితులను చవిచూసింది. కంపెనీ నికర లాభం ఏకంగా 10 శాతం తగ్గి రూ.2,240 కోట్లకు పరిమితమయింది. ప్రధానంగా రూపాయి విలువ క్షీణత, కమోడిటీ ధరలు పెరగడం, విక్రయాల ప్రచారంపై చేసిన ఖర్చులు మార్జిన్లపై ప్రభావం చూపించాయి. దేశ కార్ల మార్కెట్లో సగం వాటా మారుతీకే ఉన్న విషయం తెలిసిందే. కిందటేడాది ఇదే కాలంలో మారుతి లాభం రూ.2,483 కోట్లుగా ఉంది.

విక్రయాలపై ఆదాయం అతి స్వల్పంగా పెరిగి రూ.21,438 కోట్ల నుంచి రూ.21,552 కోట్లకు చేరుకుంది. ఈ కాలంలో కంపెనీ విక్రయించిన కార్లు 1.5 శాతం తగ్గి 4,84,848 యూనిట్లుగా ఉన్నాయి. ‘‘చమురు ధరలు పెరగడం వల్ల ఎక్కువ ప్రభావమే పడింది. ఇక కొనుగోలు సమయంలోనే మూడేళ్ల కాలానికి ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సి రావడం వల్ల కస్టమర్‌ రూ.9,000 అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇది కూడా కొనుగోళ్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది’’ అని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి.భార్గవ తెలిపారు.

డీజిల్‌ కార్లకు సంబంధించి చట్టాల్లోనూ అనిశ్చితి నెలకొందని, ఇది ఢిల్లీ/ఎన్‌సీఆర్‌ మార్కెట్లో విక్రయాలపై ప్రభావం చూపించిందని చెప్పారు. ఈ ఏడాది విక్రయాల్లో 10 శాతం వృద్ధికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని, తమ వంతు ప్రయత్నాలు చేస్తామని భార్గవ చెప్పారు. కంపెనీ నికర లాభం తగ్గడం చివరిగా 2013–14 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో చోటు చేసుకుంది.  

పండుగ విక్రయాలు అంతంతే
ప్రస్తుత పండుగ సీజన్‌ విక్రయాలను పెంచలేకపోయిందని, గతంలో మాదిరే విక్రయాలు ఉన్నాయని భార్గవ తెలిపారు. కనీసం 10–15 శాతం అధిక విక్రయాలు ఉంటాయని అంచనా వేసినప్పటికీ ఉపయోగం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ ఇంధనాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తుండడంతో... సీఎన్‌జీ ఆధారిత వాహనాల తయారీని పెంచనున్నట్టు చెప్పారు. ‘‘ప్రస్తుతం 8 మోడళ్లను సీఎన్‌జీ ఆప్షన్‌తో అందిస్తున్నాం. ఈ ఏడాది వీటి విక్రయాలు 50 శాతం పెరిగాయి. కస్టమర్లు సీఎన్‌జీ వాహనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది’’ అని తెలియజేశారు.

గడువుకు ముందే బీఎస్‌4 వాహనాల తయారీని నిలిపివేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి ఆరు నెలల కాలంలో రూపాయి క్షీణత వల్ల తమ మార్జిన్లపై 1.2 శాతం మేర ప్రభావం ఉన్నట్టు కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అజయ్‌సేత్‌ తెలిపారు. ఏప్రిల్‌– సెప్టెంబర్‌ కాలంలో మారుతి సుజుకి నికర లాభం 4.3 శాతం వృద్ధితో రూ.4,215 కోట్లుగా ఉంటే, ఆదాయం 12.4 శాతం వృద్ధితో రూ.43,362 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2018–19 తొలి ఆరు నెలల్లో 10 శాతం అదనంగా మొత్తం 9,75,327 కార్ల విక్రయాలను నమోదు చేసింది.

>
మరిన్ని వార్తలు