మారుతి రికార్డు స్థాయి లాభాలు

27 Oct, 2016 23:54 IST|Sakshi
మారుతి రికార్డు స్థాయి లాభాలు

క్యూ2లో రూ.2,398 కోట్లు
4,18,470 వాహనాల విక్రయం

 న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ఇండియా సెప్టెంబర్ త్రైమాసికంలో పెరిగిన వాహన విక్రయాలతో రూ.2,398 కోట్ల రికార్డు స్థాయి లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.1,497 కోట్లతో పోల్చి చూస్తే లాభం 60 శాతం వృద్ధిచెందింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను ఆర్జించడం ఇదే మొదటిసారి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నమోదైన రూ.1,486 కోట్ల రికార్డు స్థాయి లాభాన్ని తాజాగా తిరగరాసింది. ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.20,296 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన ఆదాయం రూ.15,699 కోట్లు.

అత్యుత్తమ త్రైమాసికం
సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం 4,18,470 వాహనాలను విక్రయించినట్టు కంపెనీ తెలిపింది. ఇది కంపెనీ చరిత్రలో నూతన రికార్డు. 2015-16 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో విక్రయాలు 3,60,402  ఇప్పటి వరకూ గరిష్ట రికార్డుగా ఉంది. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైన వాహనాల సంఖ్యతో పోలిస్తే సెప్టెంబర్‌లో విక్రయమైన వాహనాలు 18.4 శాతం అధికమని కంపెనీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. ఎన్నో అంశాల్లో పనితీరు పరంగా కంపెనీకి ఇది అత్యుత్తమ త్రైమాసికంగా పేర్కొన్నారు. ఇదే కొనసాగితే వార్షికంగా కంపెనీ 17 లక్షల కార్ల ఉత్పత్తితో నూరుశాతం తయారీ సామర్థ్యాన్ని వినియోగించుకున్నట్టు అవుతుందని వివరించారు.

మరిన్ని వార్తలు