కార్ల కంపెనీలకు ఊరట

3 Jun, 2014 00:58 IST|Sakshi
కార్ల కంపెనీలకు ఊరట
  • మే లో పెరిగిన మారుతీ, హ్యుందాయ్, హోండా అమ్మకాలు
  • పరిస్థితులు ఇక మెరుగుపడగలవని కంపెనీల ఆశాభావం
  •   న్యూఢిల్లీ: కొన్నాళ్లుగా గడ్డుకాలం ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ పరిశ్రమకి గత నెల కాస్త ఊరట లభించింది. స్థిరమైన కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రభావంతో దిగ్గజ కార్ల కంపెనీల అమ్మకాలు మెరుగుపడ్డాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా వంటి దిగ్గజాలు దేశీయంగా మెరుగైన గణాంకాలు నమోదు చేశాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ ఇండియా, టాటా మోటార్స్ వంటి సంస్థల అమ్మకాలు క్షీణించాయి.  మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐ) దేశీ అమ్మకాలు 16.4 శాతం పెరిగాయి. 90,560 కార్లు అమ్ముడయ్యాయి. ఇక హ్యుందాయ్ విక్రయాలు సుమారు 13 శాతం పెరిగి 36,205 వాహనాలు అమ్ముడు కాగా, ఫోర్డ్ కార్ల విక్రయాలు 51 శాతం ఎగిశాయి. 6,053 కార్లు అమ్ముడయ్యాయి.
     
     మారుతీ సుజుకీ గతేడాది మేలో అమ్మకాలు 77,821. స్విఫ్ట్, ఎస్టిలో రిట్జ్ వంటి కాంపాక్ట్ కార్ల ఊతంతో మారుతీ మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. ఈ విభాగంలో విక్రయాలు 17,147 నుంచి 26,394కి పెరిగాయి. అటు ఎం800, ఆల్టో, ఏ-స్టార్, వ్యాగన్‌ఆర్ వంటి మినీ సెగ్మెంట్ కార్ల విక్రయాలు మాత్రం 31,427 నుంచి 29,068 యూనిట్లకు తగ్గాయి.
     
     గత మూడేళ్లుగా విక్రయాల్లో పెద్దగా పెరుగుదల కనిపించటంలేదని, అయితే ఇటీవలి కాలంలో తొలిసారిగా కారు కొనాలనుకుంటున్న వారు ఎంక్వైరీలు చేయడమే కాకుండా కొనేస్తుండటం కూడా పెరుగుతోందని ఎంఎస్‌ఐ సీవోవో మయాంక్ పరీక్ తెలిపారు. చాలా రోజుల తర్వాత కొనుగోలుదారులు ఇలా కొనడం మొదలుపెట్టారని ఆయన వివరించారు. మరోవైపు, స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు వల్ల దేశ ఆర్థిక పరిస్థితులు, వ్యాపార సెంటిమెంటుపై సానుకూల ప్రభావం చూపగలదని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వినయ్ పిపర్సానియా పేర్కొన్నారు.
     
     కొత్త ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు వంటి పరిశ్రమ అనుకూల చర్యలను కొనసాగించగలదని, అలాగే కొనుగోలుదారుల సెంటిమెంటును సైతం మెరుగుపర్చే సానుకూల ప్రయత్నాలూ చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో డిమాండ్ కూడా క్రమంగా పెరగగలదని ఆశిస్తున్నట్లు ఎంఅండ్‌ఎం సీఈవో (ఆటోమోటివ్ విభాగం) ప్రవీణ్ షా పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు, కొనుగోలుదారుల సెంటిమెంటు ఆశావహంగా లేకపోవడంతో గడిచిన రెండేళ్లుగా ఆటోమొబైల్ పరిశ్రమకు గడ్డుకాలంగా గడిచిందని జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి. బాలేంద్రన్ చెప్పారు. నిర్ణయాత్మక ప్రభుత్వం రాకతో రాబోయే రోజుల్లో మార్కెట్ సెంటిమెంటు మెరుగుపడగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు