ఆటో సేల్స్.. రివర్స్‌గేర్

2 Jul, 2013 03:14 IST|Sakshi
AUTO SALES

న్యూఢిల్లీ: అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఇంధనం ధరలు (ముఖ్యంగా డీజిల్) జూన్‌లోనూ వాహనాల అమ్మకాలను దెబ్బతీశాయి. దేశీయంగా మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా వంటి దిగ్గజాల వాహన విక్రయాలు క్షీణించాయి. అయితే, హ్యుందాయ్, ఫోర్డ్ ఇండియా వంటి కంపెనీలు మాత్రం ఎదురీదాయి. కొత్త కాంపాక్ట్ కారు అమేజ్ ఊతంతో హోండా కార్స్ ఇండియా అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. జూన్‌లో మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐ) దేశీ అమ్మకాలు 7.8% క్షీణించి 77,002కి పడిపోయాయి. కంపెనీకి చెందిన దాదాపు అన్ని విభాగాల్లోనూ విక్రయాలు తగ్గాయి. లగ్జరీ సెడాన్ కిజాషీ కారు కొనుగోళ్లే జరగలేదు. టాటా మోటార్స్ కార్ల అమ్మకాలు 31.5 శాతం క్షీణించి 11,804కి తగ్గిపోయాయి. అటు హ్యుందాయ్ విక్రయాలు సుమారు అరశాతం పెరిగి 30,610గా నమోదయ్యాయి.
 
 బలహీన సెంటిమెంట్ ..
బలహీనమైన ఆర్థిక పరిస్థితులతో మార్కెట్ సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడుతోందని, మార్కెట్‌లో మందగమన పరిస్థితులున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) డిప్యూటీ ఎండీ సందీప్ సింగ్ చెప్పారు. రూపాయి క్షీణతతో ఇంధనాల రేట్లు పెరగడం, అధిక వడ్డీ రేట్లు, ఎస్‌యూవీలపై అదనపు ఎక్సైజ్ సుంకం తదితర అంశాలు అమ్మకాలపై ప్రభావం చూపాయని మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) సీఈవో(ఆటోమోటివ్) ప్రవీణ్ షా చెప్పారు. వీటితో పాటు వ్యవస్థాగతమైన ఆటంకాలు, స్థూల ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు సైతం ఇందుకు కారణమవుతున్నాయని జీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ తెలిపారు. పలు సమస్యలతో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధి మందగిస్తున్నప్పటికీ.. పటిష్టమైన పోర్ట్‌ఫోలియోతో తాము కొంత మెరుగైన ఫలితాలు సాధించగలిగినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ శ్రీవాస్తవ చెప్పారు. కార్ల అమ్మకాలు వరుసగా ఏడో నెల మేలోనూ క్షీణించిన సంగతి తెలిసిందే. 2012 మే లో 1,63,222 కార్లు అమ్ముడవగా ఈ ఏడాది మేలో 1,43,216 కార్లు అమ్ముడయ్యాయి.
 
 మహీంద్రా రేట్లు అరశాతం పెంపు..
 ముడివస్తువుల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో మార్జిన్లను కాపాడుకునేందుకు వాహనాల రేట్లను నామమాత్రంగా అర శాతం పెంచుతున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగం సీఈవో ప్రవీణ్ షా చెప్పారు. ప్రీమియం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు ఎక్స్‌యూవీ 500, రెక్స్‌టన్ మినహా అన్ని మోడల్స్‌కి ఇది వర్తిస్తుందని వివరించారు. తాజా పరిణామంతో మోడల్‌ను బట్టి ధరలు రూ. 3,000 నుంచి రూ. 6,000 దాకా పెరగొచ్చని షా చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా