నాలుగో నెల్లోనూ మారుతీ కోత

11 Jun, 2019 13:30 IST|Sakshi

18 శాతం తగ్గిన వాహన తయారీ

డిమాండ్‌ మందగమనమే కారణం  

న్యూఢిల్లీ: వాహన దిగ్గజం, మారుతీ సుజుకీ ఇండియా గత నెలలో వాహన ఉత్పత్తిని 18 శాతం తగ్గించింది. ఈ కంపెనీ వాహనాల ఉత్పత్తి లో కోత విధించడం ఇదివరుసగా నాలుగో నెల. మారుతీ సుజుకీ ఇండియా ఈ మేరకు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు నివేదించింది. వివరాలివీ...
గత ఏడాది మేలో ఈ కంపెనీ 1,84,612 వాహనాలను తయారు చేసింది.
ఈ ఏడాది మేలో మాత్రం వాహనాల ఉత్పత్తి 18% తగ్గి 1,51,188కు  పరిమితమైంది
తేలిక రకం వాణిజ్య వాహనం సూపర్‌ క్యారీ మినహా అన్ని సెగ్మెంట్లలలో అన్ని మోడళ్ల వాహన తయారీ తగ్గిపోయింది.  
ఆల్టో, స్విఫ్ట్, డిజైర్‌లతో కూడిన ప్రయాణికుల వాహన ఉత్పత్తి 1,82,571 నుంచి 19 శాతం తగ్గి 1,48,095కు తగ్గిపోయింది.  
మినీ సెగ్మెంట్‌ వాహన తయారీ 42 శాతం తగ్గి 23,874కు పరిమితమైంది.
కాంపాక్ట్‌ సెగ్మెంట్‌ కార్లతయారీనీమారుతీ తగ్గించింది. గత ఏడాది మేలో 93,641గా ఉన్న ఈ విభాగం కార్ల తయారీ ఈ ఏడాది మేలో 10% తగ్గి 84,705కు చేరింది.  
యుటిలిటి వెహికల్స్‌ ఉత్పత్తి 25,571 నుంచి 3 శాతం తగ్గి 24,748కు పడిపోయింది.  
వ్యాన్‌ల తయారీ 16,819 నుంచి 35 శాతం క్షీణించి 10,934కు పరిమితమైంది.
మే నెలలోనే కాకుండా ఈ ఏడాది ఏప్రిల్, మార్చి నెలల్లో కూడా మారుతీ కంపెనీ తన అన్ని ప్లాంట్లలో వాహన తయారీలో 10 శాతం కోత విధించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వాహనాల తయారీని 8 శాతం మేర తగ్గించింది. 

విక్రయాలపై ప్రభావం ఉండబట్టే...
ఇటీవల కాలంలో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. డిమాండ్‌ మందగించటంతో పలు కంపెనీలు ఉత్పత్తిలో కోత విధిస్తున్నాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ అయితే ఏకంగా తన ప్లాంట్లన్నింటినీ 13 రోజుల పాటు మూసేసింది. మార్కెట్‌ డిమాండ్‌ సర్దుబాటు నిమిత్తం ప్లాంట్లన్నింటినీ కొన్ని రోజులు మూసేయక తప్పలేదని ఈ కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయాణికుల వాహన విక్రయాలు 17 శాతం తగ్గాయి. ఇది దాదాపు ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి. నిధుల కొరత సమస్యకు తోడు సెంటిమెంట్‌  బలహీనంగా ఉండటంతో వాహన విక్రయాలు తగ్గుతున్నాయి. పండుగల సీజన్‌ వరకూ ఇదే ధోరణి కొనసాగుతుందని, పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయని వాహన కంపెనీలు ఆశిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు