కార్ల విక్రయాల్లో మారుతీ హవా

23 Sep, 2014 00:36 IST|Sakshi
కార్ల విక్రయాల్లో మారుతీ హవా

ఏప్రిల్-ఆగస్టు టాప్ టెన్‌లో తొలి 4 మోడల్స్ మారుతీవే
న్యూఢిల్లీ: దేశీ కార్ల మార్కెట్లో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ హవా కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో తొలి నాలుగు స్థానాల్లో మారుతీ కార్లే ఉండటం ఇందుకు నిదర్శనం. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం మారుతీకి చెందిన చిన్న కారు ఆల్టో అగ్ర స్థానంలో ఉంది. అదే సంస్థకు చెందిన డిజైర్, స్విఫ్ట్, వ్యాగన్‌ఆర్ కార్లు వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాలు ఆక్రమించాయి. మరోవైపు, హ్యుందాయ్ కంపెనీకి చెందిన గ్రాండ్ ఐ10 అయిదో స్థానంలో, ఎక్సెంట్ ఆరో స్థానంలో, ఇయాన్ ఏడో స్థానంలో నిల్చాయి.

మరోవైపు, ఇప్పటిదాకా ఎనిమిదో స్థానంలో ఉన్న హోండా సిటీ కారు అమేజ్ పదో స్థానానికి తగ్గగా, అదే కంపెనీకి చెందిన సిటీ కారు ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఇక మారుతీ సెలీరియో తొమ్మిదో స్థానంలో ని లిచింది. ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో ఆల్టో కార్లు 1,03,123, డిజైర్ వాహనాలు 82,912, స్విఫ్ట్ 80,861, వ్యాగన్ ఆర్ 63,051 అమ్ముడయ్యాయి. అటు, హ్యుందాయ్ తమ గ్రాండ్ ఐ10 వాహనాలు 40,530, ఎక్సెంట్ 33,685, ఇయాన్ 32,171 కార్లను విక్రయించింది. అటు సెలీరియో కార్లు 29,591 అమ్ముడయ్యాయి. హోండా సిటీ కార్లు 30,447, అమేజ్ కార్లు 28,887 అమ్ముడయ్యాయి.

మరిన్ని వార్తలు