ఎఫ్‌డీఐల్లో మారిషస్‌ మళ్లీ టాప్‌!!

3 Sep, 2018 01:52 IST|Sakshi

2017–18లో 13.41 బిలియన్‌ డాలర్లు

రెండో స్థానంలో సింగపూర్‌

న్యూఢిల్లీ: భారత్‌లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు కేంద్రంగా మారిషస్‌ మళ్లీ అగ్రస్థానంలో నిల్చింది. 2017–18లో మొత్తం ఎఫ్‌డీఐలు స్వల్పంగా 36.31 బిలియన్‌ డాలర్ల నుంచి 37.36 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఇందులో మారిషస్‌ నుంచి 13.41 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఏడాది ఇవి 13.38 బిలియన్‌ డాలర్లు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో సింగపూర్‌ నుంచి పెట్టుబడులు 6.52 బిలియన్‌ డాలర్ల నుంచి 9.27 డాలర్లకు పెరగ్గా, నెదర్లాండ్స్‌ నుంచి ఎఫ్‌డీఐలు 3.23 బిలియన్‌ డాలర్ల నుంచి 2.67 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.

గతేడాది ఎఫ్‌డీఐలకు సంబంధించిన ప్రాథమిక గణాంకాల ప్రకారం తయారీ రంగంలోకి 7.06 బిలియన్‌ డాలర్లకు తగ్గిపోయాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇవి 11.97 బిలియన్‌ డాలర్లు. అయితే, కమ్యూనికేషన్స్‌ సర్వీసుల్లోకి మాత్రం పెట్టుబడులు 5.8 బిలియన్‌ డాలర్ల నుంచి 8.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అటు రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాల విభాగంలోకి విదేశీ పెట్టుబడులు కూడా 2.77 బిలియన్‌ డాలర్ల నుంచి 4.47 బిలియన్‌ డాలర్లకు ఎగియగా, ఆర్థిక సేవల రంగంలోకి ఎఫ్‌డీఐలు 3.73 బిలియన్‌ డాలర్ల నుంచి 4.07 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. కార్పొరేట్ల ఆదాయాలు, వినియోగదారుల డిమాండ్‌ మెరుగుపడుతున్న సంకేతాల నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో పెట్టుబడులు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయని అసోచాం తెలిపింది.

మరిన్ని వార్తలు