50 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యాం..

11 Mar, 2016 00:27 IST|Sakshi
50 లక్షల మంది కస్టమర్లకు చేరువయ్యాం..

2018కల్లా మొత్తం 250 స్టోర్లు 
మ్యాక్స్ ఫ్యాషన్ ఈడీ వసంత్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాల్యూ ఫ్యాషన్ బ్రాండ్ అయిన మ్యాక్స్ పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. 50 నగరాల్లో 135 స్టోర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ 2018 మార్చికల్లా మొత్తం ఔట్‌లెట్ల సంఖ్యను 250కి చేర్చనుంది. 20% స్టోర్లు ఫ్రాంచైజీ విధానంలో నడుస్తున్నాయి. ఒక్కో స్టోర్‌కు రూ.5 కోట్ల వ్యయం అవుతోంది. టాప్-7 నగరాల్లోనే 65 స్టోర్లున్నాయని కంపెనీ చెబుతోంది. వ్యాపారంలో 60% వాటా ఈ నగరాలదేనని మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా ఈడీ వసంత్ కుమార్ తెలిపారు. దుబాయికి చెందిన ల్యాండ్‌మార్క్ గ్రూప్ కంపెనీ అయిన మ్యాక్స్ భారత్‌లో ప్రవేశించి 10 ఏళ్లు పూ ర్తయిన సందర్భంగా గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లో 14 స్టోర్లున్నాయి. మరో 6 ఔట్‌లెట్లను ఏడాదిలో నెలకొల్పుతామన్నారు.

 యూత్ కోసం కొత్తగా..: యువతకు ప్రత్యేకంగా మిలేనియల్ ఫార్మాట్‌లో మ్యాక్స్ ఔట్‌లెట్లు రానున్నాయని వసంత్ తెలిపారు. బెంగళూరులో ఒకటి ఏర్పాటు చేశామని, ఈ ఏడాది హైదరాబాద్‌లో నెలకొల్పుతామన్నారు. టాప్-7 నగరాల్లో 2018 కల్లా 12 స్టోర్లు అందుబాటులోకి తెస్తామన్నారు. మ్యాక్స్ ఏటా 10 లక్షల మంది కస్టమర్లకు చేరువ అవుతోందన్నారు. ప్రస్తుత కస్టమర్ల సంఖ్య 50 లక్షలపైమాటేనని చెప్పారు. కాగా, భారత్‌లో రూ.80 వేల కోట్ల వాల్యూ ఫ్యాషన్ మార్కెట్ ఏటా 10% వృద్ధి చెందుతోంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 20% వృద్ధితో రూ.30 వేల కోట్లు. 2014-15లో రూ.1,400 కోట్ల టర్నోవర్ నమోదు చేసిన మ్యాక్స్ ఫ్యాషన్, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,800 కోట్లు ఆశిస్తోంది. కంపెనీ ఆదాయంలో తెలుగు రాష్ట్రాల వాటా 10%.

>
మరిన్ని వార్తలు