విస్తరణ బాటలో.. మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌

20 Oct, 2018 00:51 IST|Sakshi

రూ.250 కోట్లతో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లు

2020 నాటికి టాప్‌–5కి చేరతాం

‘సాక్షి’తో సంస్థ ఎండీ అనిల్‌ కృష్ణ  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న మ్యాక్స్‌క్యూర్‌ హాస్పిటల్స్‌ విస్తరణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలోని నాసిక్‌లో 11వ ఆసుపత్రిని 350 పడకల సామర్థ్యంతో నెలకొల్పింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ దీన్ని ఈ నెల 24న ఆరంభిస్తారు. అశోక గ్రూప్‌తో కలిసి ఈ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు మ్యాక్స్‌క్యూర్‌ ఎండీ జి.అనిల్‌ కృష్ణ ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. మెడికవర్‌ బ్రాండ్‌తో రానున్న ఈ ఆసుపత్రికి స్థలం, మౌలిక వసతులను అశోక గ్రూప్‌ సమకూరుస్తోంది. వైద్య పరికరాల ఏర్పాటు, ఆసుపత్రి నిర్వహణను మ్యాక్స్‌క్యూర్‌ చేపడుతుంది.

మరో 1,000 పడకలు..
మ్యాక్స్‌క్యూర్‌ గ్రూప్‌లో మ్యాక్స్‌క్యూర్, మై క్యూర్, సింహపురి, మెడికవర్‌ బ్రాండ్లలో హైదరాబాద్, వైజాగ్, కర్నూలు, కరీంనగర్, నిజామాబాద్, నెల్లూరు, సంగారెడ్డిలో ఆసుపత్రులున్నాయి. నాసిక్‌తో కలిపి మొత్తం పడకల సామర్థ్యం 2,000కు చేరుకుంది. ఏడాదిలో మరో 600 పడకలు జతకూడతాయని అనిల్‌ కృష్ణ చెప్పారు.

‘‘ముంబై, పుణే నగరంతోపాటు కర్ణాటకలోనూ విస్తరిస్తాం. పాత ఆసుపత్రుల కొనుగోలు లేదా కొత్తవి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. 2020 నాటికి 3,000 పడకల సామర్థ్యానికి చేరుకుని టాప్‌–5 వైద్య సంస్థల్లో ఒకటిగా నిలుస్తాం’’ అంటూ భవిష్యత్తును ఆవిష్కరించారు. మ్యాక్స్‌క్యూర్‌ గ్రూప్‌ లో యూరప్‌కు చెందిన దిగ్గజ హెల్త్‌కేర్‌ సంస్థ మెడికవర్‌కు 42 శాతం వాటా ఉంది. కొత్త ఆసుపత్రులన్నీ మెడికవర్‌ బ్రాండ్‌తో రానున్నాయి.

మూడు ప్రత్యేక సెంటర్లు..
క్యాన్సర్‌ కేర్‌కు మూడు ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పుతున్నట్టు మ్యాక్స్‌క్యూర్‌ గ్రూప్‌ సీఈవో పి.హరికృష్ణ చెప్పారు. ‘హైదరాబాద్, నెల్లూరు, కర్నూలులో ఇవి వస్తాయి. వీటికి రూ.250 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.450 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాం. 2018–19లో రూ.600 కోట్లు ఆశిస్తున్నాం. వైద్యులు, సిబ్బందితో కలిపి మొత్తం 5,800 మంది ఉద్యోగులున్నారు. 2020–21 నాటికి రూ.1,000 కోట్ల టర్నోవర్‌కు చేరుకోవాలన్నది టార్గెట్‌. ఆ సమయానికి ఉద్యోగుల సంఖ్య 9,000 దాటుతుంది’ అని వివరించారు.

మరిన్ని వార్తలు