కాలం చెల్లిన వాహనాల  మార్పిడిపై రాయితీ!

29 Jan, 2019 00:38 IST|Sakshi

ఆటోమొబైల్‌ రంగం

కార్లపై రెండుకు మించి  పన్ను రేట్లు వద్దు

ఎలక్ట్రిక్‌ వాహనాలకు  ప్రత్యేక పన్ను రేటు

ఈ సారైనా బడ్జెట్‌లో  వీటికి చోటివ్వాలి

ఆటోమొబైల్‌ పరిశ్రమ డిమాండ్లు

న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యం నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉండగా... ఈ దిశగా ఆటోమొబైల్‌ పరిశ్రమ పలు కీలక సూచనలు చేసింది. రానున్న మధ్యంతర బడ్జెట్లో వీటికి చోటు కల్పించాలని డిమాండ్‌ చేసింది. ముఖ్యంగా 2000 సంవత్సరానికి ముందు నాటి పాత వాహనాలను వినియోగం నుంచి తప్పించేందుకు ముఖ్య సూచన చేసింది. పాతవాటిని కొత్త వాహనంతో మార్పిడి చేసుకోవడంపై ఒక్కసారి ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అలాగే, కార్లపై రెండుకు మించి పన్ను రేట్లు లేకుండా చూడాలని కోరింది. బడ్జెట్‌కు ముందు భారీ పరిశ్రమల శాఖతో జరిగిన సమావేశంలో ఆటోమొబైల్‌ తయారీ సంఘాలు సియామ్, ఎస్‌ఎంఈవీ తమ ప్రతిపాదనలను తెలియజేశాయి. 

పరిశ్రమ ప్రతిపాదనలు ఇవీ...
∙15 సంవత్సరాలకు పైబడి వయసున్న వాహనాలతోనే 80 శాతం కాలుష్యం, రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వాహనాలను మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో ముందుకు రావాలి. ఇందుకోసం 2000కు ముందు రిజిస్ట్రేషన్‌ అయిన వాహనాల మార్పిడిపై ఒక్కసారి రాయితీలు కల్పించాలి. జీఎస్టీ, రోడ్డు పన్ను రాయితీ, సబ్సిడీతో కూడిన రుణాల (ఢిల్లీలో మాదిరి) రూపంలో ప్రోత్సాహకాలు ఉండాలి.  

∙కాలుష్య నియంత్రణకు గాను బలమైన నియంత్రణ, వాహన తనిఖీల విధానం అవసరం.  

∙ప్రస్తుతం కార్లపై ఉన్న బహుళ పన్నుల రేట్ల స్థానంలో రెండు రేట్లకు మించకుండా చూడాలి. ఎలక్ట్రిక్‌ కార్లకు ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలి. 2011–12 నాటికి ఆటోమొబైల్‌ వాహనాలపై 10 శాతంగా ఉన్న పన్ను రేటు 2015–16 నాటికి 22–30 శాతానికి చేరింది. ప్రస్తుతం జీఎస్టీలో ఆటోమొబైల్‌ వాహనాలకు 28 శాతం పన్ను రేటుతోపాటు, వాహనం సౌకర్యాలు, ఇంజన్‌ సామర్థ్యాన్ని బట్టి అదనంగా 1–15 శాతం మధ్యలో సెస్సు ఉన్న విషయాన్ని పరిశ్రమ గుర్తు చేసింది. దీర్ఘకాలంలో పన్నుల క్రమబద్ధీకరణ జరగాల్సిన అవసరాన్ని తెలియజేసింది. 

∙దిగుమతి చేసుకుంటున్న పూర్తి స్థాయి వాణిజ్య వాహనాలపై కస్టమ్స్‌ డ్యూటీనీ ప్రస్తుతమున్న 25 శాతం నుంచి 40 శాతానికి పెంచాలి. డబ్ల్యూటీవోలో భారత్‌ కట్టుబడి ఉన్న రేటు ఇది. సీకేడీ యూనిట్లు, ఎస్‌కేడీ యూనిట్లకు (విడిభాగాలు దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్‌ చేయడం) పన్ను రేటు పెంపు అవసరం లేదు. ప్రస్తుతం వీటిపై సుంకాల రేటు 15–30 శాతం మధ్య ఉంది. 

∙దిగుమతి అయ్యే కార్లు, ద్విచక్ర వాహనాలపైనా కస్టమ్స్‌ డ్యూటీని మార్చకుండా ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలి. ప్రస్తుతం వీటిపై కస్టమ్స్‌ సుంకం 50–100 శాతం మధ్య ఉంది.  

∙పరిశోధన, అభివృద్ధి వ్యయాలపై 200 శాతం మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టాలి.  ఈవీలకు మరింత ప్రోత్సాహం 

∙దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ)ను పెద్ద ఎత్తున పెంచేందుకు రానున్న రెండేళ్ల కాలంలో రూ.20,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి. నిధుల సమీకరణ కోసం సంప్రదాయ వాహనాల(ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌ కలిగినవి)పై నోషనల్‌ గ్రీన్‌ సెస్సు విధించాలి. 

∙హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ఉద్దేశించిన ఫేమ్‌ పథకం రెండో దశను ఆరేళ్ల కాల వ్యవధి, నిర్దిష్ట అమలు ప్రణాళికతో ప్రకటించాలి. 2030 నాటికి 30 శాతం ఎలక్ట్రిక్‌ వాహనాల లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్థిరమైన, దీర్ఘకాలిక విధానపరమైన ప్రోత్సాహం, రాయితీలు, ప్రచారం అవసరం.  

∙అన్ని ఈవీలకు, బ్యాటరీలపై జీఎస్టీలో పన్ను 5 శాతం మించకూడదు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ సదుపాయం కూడా ఉండాలి. 

మరిన్ని వార్తలు