‘డ్రాగన్‌’ చేతికి మెక్‌డొనాల్డ్‌ చైనా వ్యాపారం

10 Jan, 2017 00:45 IST|Sakshi
‘డ్రాగన్‌’ చేతికి మెక్‌డొనాల్డ్‌ చైనా వ్యాపారం

బీజింగ్‌: అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం, మెక్‌డొనాల్డ్‌.. చైనా, హాంగ్‌కాంగ్‌ వ్యాపారానికి సంబంధించి  నియంత్రిత వాటాను విక్రయించింది. ఈ వాటాను 208 కోట్ల డాలర్లకు చైనా ప్రభుత్వ సంస్థ సిటిక్, కార్లైల్‌ గ్రూప్‌కు అమ్మేశామని మెక్‌డొనాల్డ్‌ తెలిపింది. అంతర్జాతీయ టర్న్‌ అరౌండ్‌ప్లాన్‌లో భాగంగా ఈ వాటాను విక్రయించామని పేర్కొంది. విక్రయ ఒప్పందంలో భాగంగా సిటిక్‌ లిమిటెడ్,  సిటిక్‌ క్యాపిటల్‌ హోల్డింగ్స్, కార్లైల్‌ గ్రూప్, మెక్‌డొనాల్డ్‌లు కలసి ఒక కంపెనీని ఏర్పాటు చేస్తాయి. ఈ కంపెనీలో  

సిటిక్, సిటిక్‌ క్యాపిటల్‌లకు 52 శాతం వాటా, కార్లైల్‌ గ్రూప్‌కు 28 శాతం వాటా, మెక్‌డొనాల్డ్‌కు 20 శాతం చొప్పున వాటాలుంటాయి. ఈ కంపెనీ చైనా, హాంగ్‌కాంగ్‌ల్లో మెక్‌డొనాల్డ్‌ వ్యాపారానికి 20 ఏళ్లపాటు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తుంది. అమెరికా, ఫ్రాన్స్‌ల్లో వ్యాపారం మందగించడంతో ఇల్లినాయిస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెక్‌డొనాల్డ్‌ సంస్థ అంతర్జాతీయ కార్యకలాపాలను పునర్వ్యస్థీకరిస్తోంది. దీనికి తోడు దక్షిణ చైనా సముద్ర సంబంధిత ఉద్రిక్తతల కారణంగా అమెరికాకంపెనీల వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

ఈ  నేపథ్యంలో చైనా, హాంగ్‌కాంగ్‌ల్లో 2,600కు పైగా ఉన్న రెస్టారెంట్లను విక్రయించనున్నామని గత ఏడాది మెక్‌డొనాల్డ్‌ ప్రకటించింది. 1990లో చైనాలో తన తొలిస్టార్‌ను మెక్‌డొనాల్డ్‌ ప్రారంభించింది. ప్రస్తుతంచైనా, హాంగ్‌కాంగ్‌ల్లో ఉన్న రెస్టారెంట్లలో 1.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిటిక్‌.. అనేది చైనా ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ.ఇంధనం నుంచి తయారీ రంగం, రియల్టీ రంగాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా