అలరిస్తున్న మీడియా, వినోదం

22 Mar, 2017 01:12 IST|Sakshi
అలరిస్తున్న మీడియా, వినోదం

2021 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు వ్యాపార విలువ 
వెల్లడించిన ఫిక్కీ, కేపీఎంజీ అధ్యయనం


ముంబై: దేశీయ మీడియా, వినోద రంగం మంచి జోరుమీద ఉంది. 2021 నాటికి ఈ రంగం వ్యాపార విలువ రూ.2.41 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని ఫిక్కీ, కేపీఎంజీ సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ముంబైలో మంగళవారం జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్‌ సదస్సులో దీన్ని విడుదల చేశారు. వచ్చే నాలుగేళ్ల పాటు వార్షికంగా 13.9 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. దేశీయ మీడియా, వినోద పరిశ్రమ 2016లో మిశ్రమ ఫలితాలను ఎదుర్కొందని, బాక్సాఫీసు వద్ద సినిమాల ప్రదర్శర నిరాశపరిచిందని కేపీఎంజీ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగం డైరెక్టర్‌ గిరీష్‌ మీనన్‌ పేర్కొన్నారు.

కేవలం ఓ అదనపు మాధ్యమంగానే ఉన్న డిజిటల్‌ మీడియా వేగంగా కేంద్ర స్థానంగా మారిందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే మీడియా, వినోద రంగ సంస్థలు తమ విధానాలను డిజిటల్, మార్పులకు అనుగుణంగా మలచుకోవాలని, వ్యాపారం నిలదొక్కుకునేందుకు చురుకుదనం, మార్పు కీలమకని నివేదిక పేర్కొంది. ఆర్థికంగా మెరుగైన పరస్థితులు, దేశీయ వినియోగంలో పురోగతి, రూరల్‌ మార్కెట్ల తోడ్పాటుతో మొత్తం మీద మీడియా, వినోద పరిశ్రమ 2016లో ఆరోగ్యకరమైన వృద్ధిని నిలబెట్టుకున్నట్టు తెలిపింది.

ఈ సానుకూలతలకు తోడు... డీమోనిటైజేషన్‌ నిర్ణయం వల్ల 2.5 శాతం వరకు వృద్ధికి విఘాతం కలిగినప్పటికీ ప్రకటనల్లో 11.2 శాతం వృద్ధి వల్ల మొత్తం మీద మీడియా, వినోద పరిశ్రమ 9.1 శాతం వృద్ధిని సాధించిందని వివరించింది. డీమోనిటైజేషన్‌ ప్రభావం నుంచి తిరిగి గాడిన పడి స్థిరమైన వృద్ధిని కొనసాగించాల్సి ఉందని పేర్కొంది. మెరుగైన సదుపాయాల కల్పన, ప్రభుత్వ సహకారంతో ఈ పరిశ్రమ అద్భుతమైన స్థాయికి చేరుతుందని, ఉద్యోగ అవకాశాల కొనసాగింపు ద్వారా దేశానికి సామాజికంగా, ఆర్థికంగా విలువను తీసుకొస్తుందని ఫిక్కీ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ ఉదయ్‌ శంకర్‌ పేర్కొన్నారు.  

ఏ విభాగంలో ఎంత వృద్ధి?
టెలివిజన్‌ పరిశ్రమ 2016లో 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. చందాదారుల ఆదాయంలో 7 శాతమే పెరుగుదల ఉండడం, ప్రకటనల ఆదాయం అంచనా వేసిన 11 శాతానికంటే తక్కువ ఉండడం ఇందుకు కారణాలుగా  పేర్కొంది.
ప్రింట్‌ మీడియా ఆదాయ వృద్ధి 7 శాతంగా ఉంది.
సినిమాల ఆదాయంలో వృద్ధి 3 శాతమే.
రేడియో, డిజిటల్‌ ప్రకటనలు, యానిమేషన్, విజువల్‌ ఎఫెక్టస్‌ విభాగాలూ వృద్ధి చెందాయి.
డిజిటల్‌ ప్రకటనల్లో వృద్ధి 28 శాతంగా ఉంది. మొత్తం ప్రకటనల ఆదాయంలో 15% ఈ విభాగం సొంతం చేసుకుంది.
యానిమేషన్‌ విభాగం 16.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు