ముఖేష్‌ కుడిభుజం ఆయనే

12 Jun, 2020 15:47 IST|Sakshi

ముంబై : ఆయనకు కెమేరాల మెరుపులంటే మోజులేదు..టీవీ స్క్రీన్‌లపై మెరవాలనే ఆసక్తీ లేదు. ఒంటిచేత్తో రూ వేల కోట్ల కార్పొరేట్‌ డీల్స్‌ను ఖరారు చేయగల సత్తా ఉన్నా నలుగురిలో పేరుకోసం తహతహలాడే తత్వం కాదు. భారత కార్పొరేట్‌ దిగ్గజం ముఖేష్‌ అంబానీని ముందుండి నడిపించే శక్తే అయినా ప్రచార పటాటోపాలకు వెనుకుండే వ్యక్తి..ఆయనే మనోజ్‌ మోదీ. ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, కార్పొరేట్‌ దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి మనోజ్‌ మోదీ కుడిభుజం అని కార్పొరేట్‌ వర్గాలు చెబుతుంటాయి.

గుంభనంగా, బహిరంగ వేదికల్లో పెద్దగా కనబడని మోదీని ముఖేష్‌కు అత్యంత సన్నిహితుడని చెబుతారు. ఫేస్‌బుక్‌తో 570 కోట్ల డాలర్ల భారీ డీల్‌ సంప్రదింపుల్లో మోదీ కీలక పాత్ర పోషించారు. పెట్రోకెమికల్స్‌ నుంచి ఇంటర్‌నెట్‌ టెక్నాలజీలకు ముఖేష్‌ తన వ్యాపార సామ్రాజాన్ని విస్తరించాలనే లక్ష్యంలో మనోజ్‌ మోదీ చురుగ్గా వ్యవహరించారు. రిలయన్స్‌ జియోలో మరికొన్ని ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్లు పెట్టుబడులు పెట్టే ఒప్పందాల్లోనూ ఆయనదే కీలక పాత్రని కార్పొరేట్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మోదీ నిరాడంబరంగా ఉండేందుకే ఇష్టపడతారు. సంస్ధాగత నిర్మాణంపై రిలయన్స్‌ ప్రచారం చేసుకోకున్నా అంబానీ, మనోజ్‌ మోదీల సాన్నిహిత్యం ఎలాంటిదో పరిశ్రమ వర్గాలకు తెలుసని, కీలక ఒప్పందాలను ఇరువురు ఖరారు చేస్తూ పకడ్బందీగా వాటి అమలుతీరుకు పూనుకుంటారని వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ కలారి క్యాపిటల్‌ పార్టనర్స్‌ ఎండీ వాణి కోల పేర్కొన్నారు. రిలయన్స్‌ రిటైల్‌, రిలయన్స్‌ జియోల్లో డైరెక్టర్‌గా వ్యవహరించే మనోజ్‌ మోదీ కంపెనీ ఉద్యోగులను మెరికల్లా తీర్చిదిద్దడంలోనూ ముందుంటారు.

చదవండి : ఫోర్భ్స్‌ జాబితాలో మళ్లీ ముఖేష్‌

మరిన్ని వార్తలు