‘సీసీఐ’తో వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధుల భేటీ

24 May, 2018 01:28 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయ ఈ–కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలును పూర్తి చేసేందుకు వాల్‌మార్ట్‌ చురుగ్గా వ్యవహరిస్తోంది. 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు ఈ సంస్థ ఒప్పందం చేసుకోవటం తెలిసిందే. ఈ కొనుగోలుకు అనుమతి కోరుతూ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాకు (సీసీఐ) వాల్‌మార్ట్‌ గతవారమే దరఖాస్తు సమర్పించింది. ఇందుకు ఆమోదం పొందే ప్రయత్నాల్లో భాగంగా బుధవారం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఉన్నతోద్యోగులు సీసీఐ సభ్యుడు సుధీర్‌ మిట్టల్‌తో సమావేశమయ్యారు. దేశీయంగా తమ కంపెనీల వ్యాపారం, అభివృద్ధి ప్రణాళికల గురించి వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్‌ అయ్యర్, కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, రజనీష్‌కుమార్, ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌కృష్ణమూర్తి, గ్రూపు లీగల్‌ హెడ్‌ ఆర్‌.బవేజా ఉన్నారు.

ఇది మర్యాదపూర్వక సమావేశమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ భేటీపై అధికారికంగా ఎటువంటి ప్రకటనా విడుదల కాలేదు. తమ రెండు కంపెనీలూ ఏకమైతే పోటీ పరమైన సమస్యలేవీ ఉత్పన్నం కాబోవని ఇరు కంపెనీలు సీసీఐకి సమర్పించిన దరఖాస్తులో పేర్కొన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌–వాల్‌మార్ట్‌ డీల్‌పై సీసీఐని ఆశ్రయిస్తామని ట్రేడర్ల సంఘం సీఏఐటీ గత వారం ప్రకటించటం గమనార్హం. ఈ రెండూ ఒక్కటైతే దేశీయ రిటైల్‌ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని రిటైలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విక్రయదారుల సంఘం ఇప్పటికే సీసీఐని ఆశ్రయించింది.  

మరిన్ని వార్తలు