మెహుల్‌ చోక్సీ తాజా వీడియో సంచలనం

11 Sep, 2018 13:25 IST|Sakshi
గీతాంజలి గ్రూపు అధినేత మెహుల్‌ చోక్సీ

ఆంటిగ్వా: పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడు,గీతాంజలి గ్రూపు చైర్మన్‌ మెహుల్‌ చోక్సీకి చెందిన వీడియో ఒకటి ఇపుడు సంచలనంగా మారింది. తనపై తప్పుడు ఆరోపణలు నమోదు చేశారని వాదిస్తున్న చోక్సీ తాజాగా అదే వాదనను మరోసారి వినిపించారు. తనను తాను సమర్ధించుకుంటూ మొట్టమొదటిసారిగా ఆంటిగ్వా నుండి వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడారు తనపై చేసిన ఆరోపణల అవాస్తవాలనీ, నిరాధారమైనవని పేర్కొన్నాడు.

చోక్సీకి రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌కు దరఖాస్తు పెట్టుకున్న ఈడీ, తాజాగా  మరో ‘రిమైండర్‌ నోటీసు’ పంపింది.  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను దాదాపు 2 బిలియన్‌ డాలర్ల మేర మోసం చేసి, చోక్సీ దేశం నుంచి పారిపోయాడు. అలాగే  పీఎన్‌బీ స్కాంలో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు నీరవ్‌ మోదీ కుటుంబ సభ్యులకు (సోదరి పుర్వీ దీపక్‌ మోదీ, సోదరుడు నీషల్‌ మోదీ) రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేసిన అంనతరం చోక్సీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈడీ అధికారులు తనపై అక్రమ కేసులు బనాయించారనీ, చట్ట విరుద్ధంగా తన ఆస్తులను సీజ్‌ చేశారని ఈ వీడియోలో ఆరోపించాడు.

భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్‌పోర్టు  పునరుద్ధరను భారీ ప్రయత్నాలు చేశాననీ, కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనరాలేదని ఆరోపించాడు.పోర్టును ఎందుకు  రద్దు చేశారో చెప్పలేదు, తన వల్ల దేశానికి ప్రమాదం ఎలాంటి  ఉందో ముంబైలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం వివరణ ఇవ్వలేదని తెలిపాడు. పాస్‌పోర్ట్‌ రద్దు చేసిన అనంతరం ఇక తాను లొంగిపోవడం అనే ప్రశ్నే లేదని చోక్సీ వాదించాడు. 

కాగా సుమారు 14వేల కోట్ల పీఎన్‌బీ స్కాంలో చోక్సీ నీరవ్‌ మోదీ తరువాత కీలక నిందితుడుగా ఉన్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన అధికారులు చోక్సీ పాస్‌పోర్టును రద్దు చేసారు. అలాగే గత నవంబరులో ఆంటిగా పౌరసత్వాన్ని స్వీకరించిన చోక్సీ అక్కడ తలదాచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు