ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలతో తిరుపతికి మరింత ప్రగతి

3 Aug, 2019 10:38 IST|Sakshi
మంత్రి మేకపాటి గౌతం రెడ్డితో సెల్‌కాన్‌ సీఎండీ వై.గురు తదితరులు

బిజినెస్‌ సెంటర్‌ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మేకపాటి

యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో ప్రత్యేక తర్ఫీదు

రేణిగుంట (చిత్తూరు జిల్లా) : ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలను తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకొచ్చి ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బిజినెస్‌ సెంటర్‌ నూతన భవనాన్ని ఆయన శుక్రవారం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలసి ప్రారంభించారు. వింగ్‌టెక్‌ సారథ్యంలో నడుస్తున్న సెల్‌కాన్‌ ఫెసిలిటీలో సెల్‌ఫోన్లు, చార్జర్ల తయారీ విభాగాన్ని పరిశీలించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. కార్బన్‌ కంపెనీని పరిశీలించారు. ఇప్పటికే 7 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు, రెండో యూనిట్‌ పూర్తయితే మరో 7 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని కంపెనీ ప్రతినిధులు మాలిక్, నాగేంద్ర మంత్రికి తెలిపారు.

డిక్సన్‌ ఫేజ్‌–2 ప్రారంభం..
ఈఎంసీ–2లో నిర్మాణంలో ఉన్న సెవెన్‌ హిల్స్‌ డిజిటల్‌ పార్కును మేకపాటి గౌతంరెడ్డి, నారాయణస్వామి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. డిక్సన్‌ కంపెనీ ఫేజ్‌–2 కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.  వివిధ  కంపెనీల ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు మేకపాటి చెప్పారు. పలు కంపెనీల్లో పనిచేస్తున్న యువతకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ నైపుణ్య సంస్థ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.  పరిశ్రమల స్థాపనకు భూములిచ్చిన వారికి ఉద్యోగాల కల్పనలో మొదటి ప్రాధాన్యం ఉంటుందని బియ్యపు మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు