మాస్‌ కార్లపైనే మారుతీ దృష్టి

24 Aug, 2018 01:22 IST|Sakshi

సంస్థ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ

న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్ల కన్నా జనసామాన్యం ఎక్కువగా కొనుగోలు చేసే అందుబాటు ధరల్లోని కార్ల విభాగంపైనే దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ దృష్టి పెట్టనుంది. కంపెనీ 37వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మారుతీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే మాస్‌ విభాగంలో మెజారిటీ వాటా ఉన్న మారుతీ .. లగ్జరీ సెగ్మెంట్‌లో కూడా ప్రవేశించాలంటూ షేర్‌హోల్డర్లు చేసిన సూచనపై స్పందిస్తూ ఆయన ఈ వివరణనిచ్చారు. మారుతీ లగ్జరీ కార్ల కోవకి చెందినది కాదని భార్గవ చెప్పారు.

అవి అధిక రేటుతో తక్కువ సంఖ్యలో కార్లను విక్రయిస్తాయని... మారుతీ సుజుకీ అందుబాటు ధరలో భారీ స్థాయిలో విక్రయిస్తుందని ఆయన వివరించారు. రేటుకు అత్యంత ప్రాధాన్యం ఉండే దేశీ మార్కెట్లో ఈ వ్యూహంపైనే తాము ప్రధానంగా దృష్టి సారిస్తామని భార్గవ చెప్పారు. అలాగని, ప్రీమియం కార్ల అనుభూతి కోరుకునే వారికి ఆ ఫీచర్స్‌ను అందించకుండా ఉండబోమని, ప్రీమియం కార్లతో పోలిస్తే చౌకగానే అందిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు