బెంజ్‌ కార్లపై బంపర్‌ ఆఫర్లు

8 Aug, 2019 18:33 IST|Sakshi

అమ్మకాలు పడిపోవడంతో మెర్సిడెస్‌ బెంజ్‌ ఆఫర్లు

సాక్షి,  న్యూఢిల్లీ:  జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌ భారతీయ వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇటీవలి కాలంలో తమ కార్ల అమ్మకాలు పడిపోయిన నేపథ్యంలో,  కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను అందిస్తోంది మెర్సిడెస్‌ బెంజ్‌.  ముఖ్యంగా దఫల వారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తోంది.  ఇం​కా సరసమైన ఈఎంఐ సదుపాయం, రెండేళ్ల కాంప్లింమెంటరీ ఇన్సూరెన్స్‌ లాంటి ఆఫర్‌లను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై ఈ ఆఫర్లను అందించనున్నమాని బెంజ్‌ గురువారం ప్రకటించింది. ఈ ఆఫర్లకు తోడు రెండు తమ వాహనాలపై తాజా అప్‌గ్రేడ్స్‌ను అదనంగా ఎలాంటి చార్జ్‌ వసూలు చేయకుండానే అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ ప్రకటనలో తెలిపింది.

ఆఫర్లలో భాగంగా, ఒక కస్టమర్ వాహనం ఖరీదులో నాలుగింట ఒక వంతు ప్రారంభ చెల్లింపుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని మూడు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించి మెర్సిడెస్ బెంజ్ కారును సొంతం చేసుకోవచ్చు. సి, ఇ, ఎస్-క్లాస్, సీఎల్‌ఎ, జీఎల్‌ఎ, జీఎల్‌సి, జీఎల్‌ఇ, జీఎల్‌ఎస్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది కాకుండా, కస్టమర్ 60 నెలల ఈఎంఐ ఆప్షన్‌ ఎంచుకుని కారును కూడా సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు..40 శాతం దాకా తక్కువ ఈఎంఐ ఆఫర్‌ కూడా అందిస్తోంది. మెయింటెనెన్స్‌, వారంటీ, కచ్చితమైన బై బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఇందులో భాగం. దీంతోపాటు రెండేళ్ల కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్‌ ఉచితం.

కొనుగోలు విషయంలో వినియోగదారుడికి ఆర్థిక సౌలభ్యాన్ని అందించడం ద్వారా కస్టమర్ విశ్వాసాన్ని తిరిగి  పొందాలనే లక్ష్యంతో ఈ ఆఫర్లను తీసుకొచ్చామని, భారతీయ వినియోగదారుల నాడిని అర్థం చేసుకున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. అలాగే తమ మొత్తం పోర్ట్‌ఫోలియో బీఎస్‌ -6 నిబంధనలకనుగుణంగా క్రమంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 శాతం సాధించామని, 2019 సెప్టెంబర్ నాటికి 80 శాతానికి చేరుకుంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్, 2020 కాలపరిమితి కంటే ముందే తమ మొత్తం పోర్ట్‌ఫోలియో బీఎస్‌-6 పరివర్తన సాధిస్తామన్నారు. ఆటో పరిశ్రమ 2001 నుండి మందగమనాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది 40 వేల యూనిట్లకు పైగా విక్రయించిన సంస్థ ప్రస్తుత సంవత్సరం జనవరి-జూన్ కాలంలో 3 నుంచి 5 వేల  కార్లను విక్రయించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా