దేశీ బ్యాంకింగ్‌ రంగానికి నవోదయం

2 Apr, 2020 06:22 IST|Sakshi

మెగా విలీనాలపై ఆర్థిక శాఖ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీ) మెగా విలీనంపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించింది. దేశీ బ్యాంకింగ్‌ రంగానికి ఇది నవోదయంగా అభివర్ణించింది. ‘మరింత పటిష్టమైన, భారీ పీఎస్‌బీలు ఇంకా మెరుగైన ప్రత్యేక పథకాలు, మరింత వేగంగా రుణ ప్రాసెసింగ్‌ సేవలను కస్టమర్లకు అందించగలుగుతాయి. అవసరాలకు అనుగుణంగా ఇంటివద్దకే బ్యాంకింగ్‌ సేవలను విస్తరించగలుగుతాయి‘ అని ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం.. మ్రైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేసింది. నాలుగు పీఎస్‌బీల్లో ఆరు పీఎస్‌బీల విలీనం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఓవైపు దేశవ్యాప్తంగా కరోనా పరమైన లాక్‌డౌన్‌ అమలవుతున్న తరుణంలో పీఎస్‌బీల విలీనం యథాప్రకారం అమల్లోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, విలీనం చేసుకున్న యునైటెడ్‌ బ్యాంక్, ఓరియంటల్‌ బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా ఉన్న శాఖలన్నీ తమ బ్రాంచీలుగా సేవలు అందిస్తున్నాయని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వెల్లడిం చింది. తమ బ్యాంకుకు ఇకపై 11,000 పైచిలుకు శాఖలు, 13,000 పైగా ఏటీఎంలు, ఒక లక్ష మంది పైగా ఉద్యోగులు, రూ. 18 లక్షల కోట్ల పైచిలుకు వ్యాపారం ఉంటుందని పీఎన్‌బీ ఎండీ ఎస్‌ఎస్‌ మల్లికార్జునరావు తెలిపారు. మెగా విలీనంలో భాగంగా.. కెనరా బ్యాంకులో సిండికేట్‌ బ్యాంకు.. యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు.. ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకును విలీనం చేశారు.

మరిన్ని వార్తలు