ఇక గ్రామీణ బ్యాంకుల విలీనం

24 Sep, 2018 00:49 IST|Sakshi

56 నుంచి 36కి తగ్గించే యోచన

రాష్ట్రాలతో సంప్రతింపులు

ఆర్థిక శాఖ వర్గాల వెల్లడి

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో మరింత కన్సాలిడేషన్‌కి తెరతీస్తూ.. మరిన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను (ఆర్‌ఆర్‌బీ) కూడా విలీనం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. ప్రస్తుతం 56 ఆర్‌ఆర్‌బీలు ఉండగా.. ఈ సంఖ్యను 36కి తగ్గించాలని యోచిస్తోంది. ఆర్‌ఆర్‌బీల స్పాన్సరర్స్‌లో రాష్ట్రాలు కూడా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రతింపులు జరుపుతోంది. కేంద్ర ఆర్థిక శాఖలోని సీనియర్‌ అధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. ఒకే రాష్ట్రంలోని ఆర్‌ఆర్‌బీలను విలీనం చేసేందుకు సంబంధించి స్పాన్సర్‌ బ్యాంకులు కూడా మార్గదర్శ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయని వివరించారు.

ఉత్పాదకత పెంచుకోవడానికి, ఆర్థికంగా మరింత పటిష్టంగా మారడానికి, గ్రామీణ ప్రాంతాల్లో రుణ లభ్యతను పెంచడానికి ఆర్‌ఆర్‌బీల విలీనం తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.  అలాగే, ఆయా బ్యాంకులు వ్యయాలను తగ్గించుకోవడానికి, టెక్నాలజీ వినియోగంతో పెంచుకోవడంతో పాటు కార్యకలాపాలను విస్తరించుకోవడానికి కూడా ఉపయోగపడగలదని అధికారి తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ తర్వాత మరో మెగా బ్యాంకును ఏర్పాటు చేసే దిశగా ఇటీవలే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా, దేనా బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో తాజాగా ఆర్‌ఆర్‌బీల విలీన ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది.   

2005 నుంచే కన్సాలిడేషన్‌..: గ్రామీణ ప్రాంతాల్లో సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణ, బ్యాంకింగ్‌ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఆర్‌ఆర్‌బీ 1976 చట్టం కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేశారు. కేంద్రం, రాష్ట్రాలు, స్పాన్సర్‌ బ్యాంకులతో పాటు ఇతరత్రా వనరుల నుంచి కూడా మూలధనాన్ని సమకూర్చుకునే వెసులుబాటు కల్పిస్తు 2015లో సంబంధిత చట్టాన్ని సవరించారు.

ప్రస్తుతం ఆర్‌ఆర్‌బీల్లో కేంద్రానికి 50%, స్పాన్సర్‌ బ్యాంకులకు 35%, రాష్ట్రాల ప్రభుత్వాలకు 15% వాటాలు ఉంటున్నాయి. ఆర్‌ఆర్‌బీల ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చే ఉద్దేశంతో 2005లోనే కన్సాలిడేషన్‌ ప్రయోగం జరిగింది. దీంతో 2005 మార్చి ఆఖరు నాటికి 196గా ఉన్న ఆర్‌ఆర్‌బీల సంఖ్య 2006 కల్లా 133కి తగ్గాయి. ఈ సంఖ్య ఆ తర్వాత 105కి, 2012 ఆఖరు నాటికి 82కి తగ్గింది. మరిన్ని విలీనాలతో ప్రస్తుతం 56కి దిగి వచ్చింది. సుమారు 21,200 శాఖలు ఉన్న ఆర్‌ఆర్‌బీలు 2016–17లో దాదాపు 17 శాతం వృద్ధితో రూ. 2,950 కోట్ల లాభాలు నమోదు చేశాయి. 2017 మార్చి ఆఖరుకి వివిధ పథకాల కింద ఆయా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 3.5 లక్షల కోట్లకు చేరాయి.   

>
మరిన్ని వార్తలు