మైక్రోమ్యాక్స్.. విండోస్ మొబైల్ ఫోన్‌లు

17 Jun, 2014 00:27 IST|Sakshi
మైక్రోమ్యాక్స్.. విండోస్ మొబైల్ ఫోన్‌లు

న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ 8.1 ఓఎస్‌పై పనిచేసే తొలి మొబైల్ ఫోన్లను సోమవారం ఆవిష్కరించింది. కాన్వాస్ విన్ డబ్ల్యూ121(ధర రూ.9,500), కాన్వాస్ విన్ డబ్ల్యూ092(ధర రూ.6,500)- ఈ రెండు ఫోన్‌లు డ్యుయల్-సిమ్ ఫోన్‌లని కంపెనీ చైర్మన్ సంజీవ్‌కపూర్ చెప్పారు. వచ్చే నెల నుంచి వీటి విక్రయాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
 
 ఈ రెండు ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ఫీచర్లున్నాయని వివరించారు. 5 అంగుళాల  హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉన్న కాన్వాస్ డబ్ల్యూ121లో  2,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,  32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఇక కాన్వాస్ విన్ డబ్ల్యూ 092లో 4-అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1,500 ఎంఏహెచ్ బ్యాటరీ,  5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి  ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు.
 
తొలి దేశీయ కంపెనీ..: స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో భారత్‌లో రెండో స్థానంలో ఉన్న మైక్రోమ్యాక్స్ కంపెనీ ఇప్పటివరకూ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌పై ఫోన్‌లను అందిస్తోంది. మొదటి స్థానంపై కన్నేసిన మైక్రోమ్యాక్స్ కంపెనీ విండోస్ ఓఎస్ ఆధారిత మొబైళ్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఓఎస్‌పై పనిచేసే మొబైళ్లను తయారు చేసిన మొదటి దేశీయ కంపెనీగా మైక్రోమ్యాక్స్ అవతరించింది. ఇప్పటికే విండోస్ ఓఎస్ ఆధారిత ఫోన్లను నోకియా, హెచ్‌టీసీ, ఎల్‌జీ, డెల్‌లు తయారు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు